Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాలని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. సనాతన నిర్మూలన సదస్సులో శనివారం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం అనేది ప్రతిబంధకం లాంటిదన్నారు. కొన్ని విషయాలను వ్యతిరేకించలేమని ఉదయనిధి చెప్పారు. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా లాంటి రోగాలకు ఎదురుపోలేమని, అందుకే వాటిని నిర్మూలించడమే మార్గం అన్నారు. అందుకే సనాతనను నిర్మూలించాలని ఆయన స్పష్టం చేశారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఐటి సెల్ హెడ్ అమిత్ మాల్వియా విరుచుకుపడ్డారు. 80 శాతం ప్రజల మారణహోమానికి ఉదయనిధి పిలుపునిచ్చారని ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో డీఎంకే కూటమిలో భాగమైన నేపథ్యంలో.. ముంబై సమావేశంలో నిర్ణయించింది ఇదేనా? అని అమిత్ మాల్వియా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అయితే అమిత్ మాల్వియా ట్వీట్‌పై ఉదయనిధి స్పందించారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులను చంపేయమని తాను చెప్పలేదని అన్నారు. సనాతన ధర్మం వల్ల నష్టపోతున్న అణగారిన వర్గాల తరపున తాను మాట్లాడానని చెప్పారు.