Page Loader
Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్!
తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 20, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాల దంచికొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం రోజుల్లో మరింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొంది.

Details

మంగళవారం ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు 

కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవచ్చని అంచనా. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు బుధవారం నాడు నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఈ కారణంగా ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Details

నైరుతి రుతుపవనాల పురోగతి వేగం పెరుగుతోంది

వర్షాల కారణంగా రాష్ట్రంలోని వాతావరణం కొంత మేర చల్లబడనుంది. పగటి ఉష్ణోగ్రతలు సగటున 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొంది. అంతకుమించి, నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతం, అరేబియా సముద్రం మీద వేగంగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. త్వరలోనే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాలపై విస్తరించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రుతుపవనాలు అంచనా వేసిన సమయానికి ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశముందని తెలిపింది. ప్రస్తుతం అండమాన్-నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా వ్యాపించాయి. ఈ వేగం కొనసాగితే జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.