LOADING...
Tirumala: తిరుమలలో భక్తుల కోసం అన్నప్రసాద కేంద్రంలో నూతన సదుపాయాలు.. 20 నిమిషాల్లో 1,320 కిలోల బియ్యం వండేయొచ్చు!
20 నిమిషాల్లో 1,320 కిలోల బియ్యం వండేయొచ్చు!

Tirumala: తిరుమలలో భక్తుల కోసం అన్నప్రసాద కేంద్రంలో నూతన సదుపాయాలు.. 20 నిమిషాల్లో 1,320 కిలోల బియ్యం వండేయొచ్చు!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించే తిరుమల తిరుపతి దేవస్థానాలు పరిధిలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఆధునికీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు వినియోగంలో ఉన్న పాత ఆవిరి పాత్రలను తొలగించి, వాటి స్థానంలో నూతన త్రి-జాకెట్‌ విధానంలోని ఆధునిక పాత్రలను తెప్పించారు. కేంద్రం వెనుకభాగంలో ప్రత్యేకంగా ఒక షెడ్డును నిర్మించి, అందులో మొత్తం 22 కొత్త పాత్రలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేంద్రంలో రోజుకు సుమారు 50 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే విధంగా వంటశాల,నాలుగు భోజనశాలలను నిర్మించారు. అయితే రద్దీ రోజుల్లో భక్తుల సంఖ్య లక్షకు చేరుకోవడంతో, యంత్రాలను వాటి సామర్థ్యానికి మించి వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

వివరాలు 

22 పాత్రల్లో ఒకేసారి 1,320 కిలోల బియ్యం వండే వీలు

దీనివల్ల అవి తరచూ పనిచేయకుండా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని దాతలు ముందుకు వచ్చి ఈ అత్యాధునిక పాత్రలను విరాళంగా అందించారు. ఒక్కో పాత్రలో 60 కిలోల బియ్యం ఉడికించే సామర్థ్యం ఉండగా, మొత్తం 22 పాత్రల్లో ఒకేసారి 1,320 కిలోల బియ్యం వండే వీలుంది. గతంలో ఒకసారి అన్నం వండడానికి సుమారు 25 నిమిషాలు పట్టగా, ఇప్పుడు 15 నుండి 20 నిమిషాల్లోనే వంట పూర్తవుతోంది. ఇదే తరహా పాత్రలను ఇటీవల ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వినియోగించారు. అక్కడ విజయవంతంగా పనిచేయడంతో, త్వరలో తిరుమలలో కూడా పూర్తిస్థాయిలో ఈ ఆధునిక పద్ధతిని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement