PM Modi: రాజ్యసభ వేదికగా 'మోదీ 3.0'కు రోడ్ మ్యాప్.. ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవే
PM Modi Rajya Sabha speech: రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మోదీ ఒక వైపు విపక్షాలను తూర్పారబడుతూనే.. మరోవైవు 'మోదీ-3.0' సర్కారు ఆకాంక్షలను వెలిబుచ్చారు. తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చే సయయం ఎంతో దూరంలో లేదన్నారు. మోదీ-3.0 ప్రభుత్వం అభివృద్ధి చెందిన భారతదేశ పునాదిని బలోపేతం చేయడానికి తన శక్తినంతా ఉపయోగిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే 5సంవత్సరాలలో దేశంలో చికిత్స చాలా చౌకగా మారుతుందన్నారు. పేదలకు పీఎం హౌసింగ్ అందించేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. సోలార్ పవర్ వల్ల వచ్చే ఐదేళ్లలో విద్యుత్ బిల్లు సున్నాగా మారుందన్నారు. దేశవ్యాప్తంగా పైప్డ్ గ్యాస్ కనెక్షన్ల నెట్‌వర్క్‌ను రూపొందిస్తామన్నారు.
దేశాన్ని ఉత్తరం, దక్షిణాదిగా విభజిస్తున్న కాంగ్రెస్
ప్రతిపక్షాలపై కూడా మోదీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కాంగ్రెస్, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిందన్నారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పరువును కటకటాల వెనక్కి నెట్టి, వార్తాపత్రికలను నియంత్రించింది ఎవరు అని ప్రశ్నించారు. ఇప్పుడు ఉత్తర, దక్షిణాదిని విచ్ఛిన్నం చేసే ప్రకటనలను కాంగ్రెస్ చేస్తోందన్నారు. 10 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ జాబితాలో 11వ స్థానానికి తీసుకొచ్చిందని మోదీ అన్నారు. కానీ పదేళ్లలో దేశాన్ని బీజేపీ ప్రభుత్వం 5వ స్థానానికి తీసుకొచ్చామన్నారు. అలాంటి కాంగ్రెస్ ఆర్థిక విధానాలపై తమకు పాఠాలు చెబుతోందన్నారు. సాధారణ కేటగిరీలోని పేదలకు ఏనాడూ రిజర్వేషన్లు ఇవ్వలేదని ప్రధాని అన్నారు.
దేశంలో బానిస మనస్తత్వాన్ని ప్రోత్సహించింది ఎవరు?: మోదీ
ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై పదునైన విమర్శలను గుప్పించారు. బ్రిటీష్ వారి ప్రభావం ఎవరిపై ఉన్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఎవరు పుట్టించారని తాను అడగడం లేదని, కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశంలో బానిస మనస్తత్వాన్ని ప్రోత్సహించింది ఎవరు? అని అడిగారు. మీరు బ్రిటీష్ వారిచే ప్రభావితం కాకపోతే బ్రిటిష్ వారు చేసిన శిక్షాస్మృతిని ఎందుకు మార్చలేదన్నారు. బ్రిటిష్ కాలం నాటి వందలాది చట్టాలు ఎందుకు కొనసాగాయి? మీరు రెడ్ లైట్ సంస్కృతిని ఎందుకు కొనసాగించారు? అని ప్రశ్నించారు. బ్రిటీష్ పార్లమెంటు సమయానికి అనుగుణంగా భారతదేశంలో బడ్జెట్ సంప్రదాయం సంవత్సరాలు ఎందుకు కొనసాగయని అడిగారు. మన సైన్యాల చిహ్నాలలో బానిసత్వ చిహ్నాలు ఎందుకు ఉన్నాయన్నారు. అందుకే వాటిని తాము ఒక్కొక్కటిగా తొలగిస్తున్నామన్నారు.
కాంగ్రెస్‌కు 40 సీట్లు రావాలని ప్రార్థిస్తున్న: మోదీ
ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా మోదీ తనదైన శైలిలో చురకలు అంటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల కాంగ్రెస్‌కు 40లోక్‌సభ సీట్లు రావని ప్రకటించారు. అయితే ఈ ప్రకనటను ఉటంకిస్తూ.. కాంగ్రెస్‌కు మోదీ చురకలు అంటించారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 40సీట్లు అయినా కాపాడుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు మోదీ చెప్పారు. ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి తమపై ఆరోపణలు చేస్తున్నారన్ని మోదీ అన్నారు. ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదన్నారు. BSNL, MTNLని ఎవరు నాశనం చేశారని ప్రశ్నించారు. HAL ఏ స్థితిలో ఉంచబడిందో గుర్తుంచుకోవాలన్నారు. ఎయిర్ ఇండియాను నాశనం చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. తాము బానిత్వాన్ని మోయడం లేదని కాంగ్రెస్ విరుచుకపడ్డారు.
యువరాజు (రాహుల్ గాంధీ) లాంచ్ కావట్లేదు.. మోదీ సెటైర్లు
రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'కాంగ్రెస్ యువరాజు( రాహుల్ గాంధీ)ని స్టార్-అప్‌గా ప్రజెంట్ చేసినట్లు మోదీ పేర్కొన్నారు. కానీ రాహుల్ నాన్ స్టార్టప్ అని తేలిందని మోదీ ఎగతాళి చేశారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన రాహుల్‌ని లాంచ్ చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. ఇటీవల రాజ్యసభలో ఖర్గే చేసిన ప్రసంగాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో తమకు 400సీట్ల మెజార్టీ వస్తుందని ఖర్గే పేర్కన్నట్లు గుర్తు చేసారు. కచ్చితంగా ఆయన అంచనా నిజమవుతుందన్నారు. అంతేకాకుండా, ఖర్గే ఈరోజు సుదీర్ఘ ప్రసంగం చేశారని, ఆయనకు అంత స్వేచ్ఛ ఎలా వచ్చిందని తాను ఆశ్చర్యపోయానన్నారు. వారి స్పెషల్ కమాండర్లు సభకు రాకపోవడం వల్లే ఆయన సభలో స్వచ్ఛగా మాట్లాడి ఉంటారని పేర్కొన్నారు.