Women Soldiers Leave Benefits: మహిళా సైనికులకు మోదీ దీపావళీ కానుక.. సెలవు ప్రయోజనాలపై కీలక నిర్ణయం
దీపావళికి ముందే మహిళా సైనికులకు భారీ కానుక ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చారిత్రాత్మక నిర్ణయానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. నావికులు (నేవీ), వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్) అధికారులతో మహిళా సైనికులకు సమానంగా ప్రసూతి, పిల్లల సంరక్షణ,పిల్లల దత్తత సెలవులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నిబంధనలు అధికారి అయినా, సైనికుడైనా అందరికీ వర్తిస్తాయి. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆమోదం తెలిపారు. అధికారి అయినా, మరోస్థాయిలో ఉన్నా.. ఈ సెలవుల మంజూరు ఆర్మీలోని మహిళలందరికీ సమానంగా వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల మిలిటరీలోని మహిళల పని పరిస్థితులు మెరుగుపడతుందని, తమ వృత్తిపరమైన, కుటుంబ జీవితాన్ని మెరుగైన రీతిలో నిర్వహించగలుగుతారని వెల్లడించింది.
2019 నుంచి భారత సైన్యంలో మహిళా సైనికుల నియామకం ప్రారంభం
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబ, సామాజిక సమస్యలను ఎదుర్కోవటానికి సైన్యంలోని మహిళలకు కూడా సహాయపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం మహిళా అధికారులకు ఇద్దరు పిల్లలకు పూర్తి వేతనంతో 180 రోజుల ప్రసూతి సెలవులు లభిస్తున్నాయి. దత్తత తీసుకుంటే, ఒక సంవత్సరం లోపు పిల్లల పెంపకం కోసం 180 రోజుల సెలవు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఇదే సెలవులు మహిళా సైనికులకు వర్తించనున్నాయి. 2019 నుంచి భారత సైన్యంలో మహిళలను సైనికులుగా నియమించుకోవడం ప్రారంభమైంది. కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌లో మహిళలు సైనికులుగా మోహరిస్తారు. అగ్నిపథ్ పథకం అమలుతో, మహిళలు ఇప్పుడు మిలిటరీ పోలీసు కార్ప్స్‌లో అగ్నివీర్‌గా చేరుతున్నారు. ప్రస్తుతం మొదటి బ్యాచ్ శిక్షణ జరుగుతోంది.