Loading...
Mann Ki Baat: యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రచారం చేయండి.. క్రియేటర్లకు మోదీ సూచన
యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రచారం చేయండి.. క్రియేటర్లకు మోదీ సూచన

Mann Ki Baat: యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రచారం చేయండి.. క్రియేటర్లకు మోదీ సూచన

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే మత్తు పదార్థాలు ఉజ్వల భవితను దెబ్బతీసి, వ్యక్తిగత జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతినబూనాలని యువతకు పిలుపునిచ్చారు. ఎలాంటి మత్తు పదార్థాలకైనా బానిసలు కాకుండా దూరంగా ఉండేలా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవగాహన కల్పించాలని కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లకు ప్రధాని మోదీ సూచించారు. ఆదివారం నిర్వహించిన 'మన్ కీ బాత్' (Mann Ki Baat) 137వ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు యువతకు దిశానిర్దేశం చేశారు.

వివరాలు

మాదకద్రవ్య రహిత భారత్ కోసం అందరూ కలిసి రావాలి

'మాదకద్రవ్య రహిత భారత్' (Drug Free India) లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం మొత్తం కలిసి రావాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడిన వారిని సమాజం అక్కున చేర్చుకుని గౌరవించాలని అన్నారు. సమాజ మద్దతుతో పాటు యోగ, ధ్యానం, దృఢచిత్తం, ఆత్మవిశ్వాసం ద్వారా మత్తు పదార్థాలకు దూరంగా ఉండవచ్చని మోదీ పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల వ్యసనానికి లోనుకాకుండా యువత మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

'నషా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని ప్రధాని మోదీ తెలిపారు.

మాదకద్రవ్య రహిత సమాజం నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

వివరాలు

పీఎం స్వనిధి యోజనతో మహిళలకు ప్రయోజనం

వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'పీఎం స్వనిధి యోజన' (PM SVANidhi Yojana) లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ పథకం ద్వారా దాదాపు 46 శాతం మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు.

వీధి వ్యాపారుల ఆర్థిక సాధికారతలో పీఎం స్వనిధి యోజన కీలకంగా ఉపయోగపడుతోందని మోదీ వివరించారు.

ADVERTISEMENT