
PM Modi: భద్రతా పరిస్థితులపై మోదీ అప్రమత్తం.. అజిత్ ఢోబాల్, జైశంకర్‌తో వరుస సమీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ భారత్‌పై మరోసారి డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్ము, శ్రీనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పాక్ డ్రోన్లు భారీగా దాడులు నిర్వహిస్తున్నాయి.
అయితే భారత సైన్యం ఈ దాడులను ధీటుగా తిప్పికొడుతూ, గట్టి ప్రతిఘటననిస్తుంది. సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ప్రధాని మోదీ తన నివాసంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీలు కూడా పాల్గొన్నారు. భారత భద్రత, విదేశాంగ వ్యూహాలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
Details
తాజా పరిణామాలపై సమగ్ర చర్చలు
ఇంతకుముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో ప్రధాని మరో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో దేశ రక్షణ సంబంధిత తాజా పరిణామాలపై సమగ్ర చర్చలు జరిగాయి. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, హోంశాఖ సీనియర్ అధికారులతో విడిగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన, విమానాశ్రయాల్లో కూడా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ పరిణామాలు యుద్ధ పరిస్థితులకు దారితీసేలా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.