India- Maldives: మాల్దీవులకు మోదీ భరోసా.. 'మీకు కష్టమొస్తే.. మేమున్నాం'
భారత ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మధ్య సోమవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియా ముందు వచ్చి కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా, మాల్దీవులతో భారతదేశానికి ఉన్న దీర్ఘకాలిక స్నేహాన్ని మోదీ ప్రత్యేకంగా గుర్తు చేశారు. మాల్దీవులు ఎప్పుడు కష్టాల్లో ఉంటే, సాయం అందించే తొలి దేశంగా భారతదేశం ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో మాల్దీవులకు వందల కొద్దీ వ్యాక్సిన్లు పంపడం, ఆర్థిక సాయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ చేపట్టిన కీలక ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య స్నేహబంధం ఉన్న నేపథ్యంలో మోదీ ఈ సహకారాన్ని భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.