LOADING...
PM Modi: ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య మోదీ కీలక భేటీ.. ఆర్థిక సలహా మండలితో చర్చలు
ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య మోదీ కీలక భేటీ.. ఆర్థిక సలహా మండలితో చర్చలు

PM Modi: ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య మోదీ కీలక భేటీ.. ఆర్థిక సలహా మండలితో చర్చలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పలు సంక్షోభాలు వెంటాడుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడి అనేక దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలు త్వరలో సర్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. అదనంగా ఎల్‌నినో ప్రభావం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన కలిగిస్తోంది. ఈసారి అత్యంత తీవ్రంగా 'సూపర్ ఎల్‌నినో' పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో పలు దేశాల్లో కరువు పరిస్థితులు తలెత్తవచ్చని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆర్థిక సలహా మండలి సమావేశంలో పాల్గొన్నారు.

వివరాలు

'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' సంస్కరణలపై చర్చ

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య భారత ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసే మార్గాలపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచే చర్యలపై విస్తృతంగా అభిప్రాయాలు తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సమావేశంలో ఆర్థిక వృద్ధిని పెంచేందుకు అవసరమైన సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణ, వ్యాపార అనుకూల విధానాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే 'ఈజ్ ఆఫ్ లివింగ్', వ్యాపార నిర్వహణను సులభతరం చేసే 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' సంస్కరణలపై కూడా చర్చ జరిగింది.

వివరాలు

పశ్చిమాసియా సంక్షోభంపై సమీక్ష

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావాన్ని కూడా మండలి సభ్యులు విశ్లేషించారు. చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు, ఎగుమతులు-దిగుమతులు, అలాగే పారిశ్రామిక రంగం, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEs)పై ఈ సంక్షోభం కలిగించే ప్రభావాన్ని వారు ప్రధానికి వివరించారు.

Advertisement

వివరాలు

జీడీపీ వృద్ధిపై మోదీ స్పందన

తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదైంది. నాలుగో త్రైమాసికంలో ఇది 7.8 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 5న ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. "2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం జీడీపీ వృద్ధి, నాలుగో త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదవడం భారత ఆర్థిక వ్యవస్థ అంతర్గత బలాన్ని, సంస్కరణల విజయాన్ని, 140 కోట్ల భారతీయుల కష్టాన్ని ప్రతిబింబిస్తోంది" అని మోదీ వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు

యువతకు అవకాశాల విస్తరణ

దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. 'ఈజ్ ఆఫ్ లివింగ్', 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' లక్ష్యాల సాధన కోసం అవసరమైన సంస్కరణలు కొనసాగిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా సంక్షోభం భారత వాణిజ్యం, వ్యవసాయం, రైతులు, MSMEలు, కీలక పారిశ్రామిక రంగాలపై చూపే ప్రభావంపై నీతి ఆయోగ్ రూపొందించిన ప్రత్యేక అంచనా నివేదికను ఇటీవల ప్రధాని కార్యాలయానికి సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్ ఆర్థిక వ్యూహాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement