
PM Modi: మోదీ మాల్దీవుల పర్యటన ఖరారు.. గత వివాదాల తర్వాత కీలక అడుగు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే), మాల్దీవులకు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దీనిపై అధికారిక వర్గాలు స్పష్టతనిచ్చాయి. ప్రత్యేకంగా మాల్దీవుల పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. గతేడాది మొదలైన వివాదాల అనంతరం ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా జులై 23-24 తేదీల్లో ప్రధాని మోదీ లండన్‌లో జరగనున్న భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై జరిగే కీలక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా యూకే ప్రభుత్వంతో దౌత్య, వాణిజ్య అంశాలపై ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఒప్పందంపై సంతకం కూడా జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Details
జులై 25-26 తేదీల్లో మల్లీవులో పర్యటన
జులై 25-26 తేదీల్లో మోదీ మాల్దీవులకు వెళ్లనున్నారు. అక్కడి 60వ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇటీవల వరకు మాల్దీవులతో భారత సంబంధాలు అంత మంచిగా లేకపోవడంతో, ఈ పర్యటనకు పెద్ద ప్రాధాన్యం కలిగింది. గతేడాది జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన తర్వాత, ఆయన ఇచ్చిన వ్యాఖ్యలపై మాల్దీవుల మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను ఆహ్లాదకరమైన సాహస గమ్యంగా అభివర్ణిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలు మాల్దీవుల ప్రతిష్ఠకు భంగం కలిగించాయంటూ ఆ దేశ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై భారతీయులు తీవ్రంగా స్పందించారు.
Details
రెండు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరణ
మాల్దీవుల పర్యటనలను రద్దు చేస్తూ సోషల్ మీడియాలో 'బాయ్‌కాట్ మాల్దీవ్స్' అంటూ హ్యాష్‌ట్యాగ్ విస్తృతంగా ట్రెండ్ అయింది. ఈ పరిణామాల అనంతరం మాల్దీవుల ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దే చర్యలు ప్రారంభించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై వేటు వేసింది. అయినా మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు భారత వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు, విధానాలు ఇరుదేశాల మధ్య మౌన ఉద్రిక్తతను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన, రెండు దేశాల మధ్య పరస్పర సంబంధాలను పునరుద్ధరించేందుకు ఓ మైలురాయిగా మారవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.