Mohan Yadav: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. రాష్ట్రానికి కొత్త సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు. సోమవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి తెరపడింది. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013లో మొదటిసారి మోహన్ యాదవ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాతి 2018 శాసనసభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2023లో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఈసారి గెలవడంతో మోహన్ యాదవ్‌ను సీఎం పదవి వరించింది.
1965 మార్చి 25న మోహన్ యాదవ్ జననం
1965 మార్చి 25న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించిన మోహన్ యాదవ్ చాలా ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. వ్యాపారవేత్తగా కూడా మోహన్ యాదవ్ గుర్తింపు పొందారు. ఇటీవలి 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ ప్రేమనారాయణ్ యాదవ్‌పై 12,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో 95,699 ఓట్లు సాధించి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా నిలిచారు. మాల్వా ఉత్తర ప్రాంతంలో భాగంగా ఉజ్జయిని లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం 2003 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది.