Jabalpur Boat Tragedy: బోట్ మునిగే ముందు క్షణాలు.. జబల్‌పుర్ ఘటన వీడియో రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో నర్మదా నదిపై ఉన్న బర్గీ జలాశయంలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 28 మందిని రక్షించగా, ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి క్షణాల ముందు ప్రయాణికులు భయంతో అల్లాడుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. బోటులోకి నీరు చేరుతుండటంతో వారు ఆందోళన చెందుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పడవ భారీ కుదుపులకు గురైన సమయంలో సిబ్బంది లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రయాణికులు ఎక్కే సమయానికే అవి అందించకపోవడం వల్లే ప్రాణనష్టం పెరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం ఈ ప్రమాదాన్ని మరింత విషాదంగా మార్చిందని వారు పేర్కొన్నారు.
వివరాలు
ఆలస్యమైన సహాయక చర్యలు
ప్రమాదానికి ముందు మరీనా అనే మహిళ తన కుమారుడు త్రిషాన్‌ను ఒడిలో బిగిగా పట్టుకున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పడవ మునిగిపోయిన తర్వాత కూడా ఆమె తన బిడ్డను అలాగే పట్టుకున్న స్థితిలో మృతదేహాలు బయటపడటం అందరినీ కంటతడి పెట్టించింది. అయితే ఆమె భర్త మాత్రం ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలంలో భారీ వర్షం కురుస్తుండటంతో శుక్రవారం సాయంత్రం గాలింపు చర్యలను నిలిపివేసి, శనివారం ఉదయం 5 గంటల నుంచి మళ్లీ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సహాయక చర్యల విషయంలో ఆలస్యమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందినప్పటికీ, సహాయక బృందాలు 6.40 గంటల వరకు బయలుదేరలేదని బాధితులు చెబుతున్నారు.
వివరాలు
15మందికి పైగా ప్రయాణికులు సురక్షితం
అయితే తమ వాహనం దెబ్బతినడం వల్లే ఆలస్యం జరిగిందని అధికారులు వివరణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, రైతులు స్పందించి 15 మందికి పైగా ప్రయాణికులను కాపాడారు. అనంతరం సుమారు 7 గంటల సమయంలో సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా క్రూయిజ్ కార్యకలాపాలు, మోటార్ బోట్ సేవలు, వాటర్ స్పోర్ట్స్‌ను తక్షణం నిలిపివేయాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే క్రూయిజ్ పైలట్ మహేష్ పటేల్, సహాయకుడు ఛోటేలాల్ గోండ్, టికెట్ కౌంటర్ ఇన్‌ఛార్జి బ్రిజేంద్రలను విధుల నుంచి తొలగించగా, బోట్ క్లబ్ మేనేజర్ సునీల్ మరావిని సస్పెండ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Inside footage of the Jabalpur cruise just moments before it sank, water rapidly flooding in, life jackets being handed out in panic and then, the unthinkable happens pic.twitter.com/In0w5B5fXC
— Surajit (@surajit_ghosh2) May 2, 2026