
Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన
ఈ వార్తాకథనం ఏంటి
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం, వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ శనివారం కేరళను తాకనున్నాయి.
ఇదే సమయంలో లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోకి ఈ రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపింది.
ఈ ప్రభావంతో రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా ఈ రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని పేర్కొంది.
జూన్ రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Details
అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం
దక్షిణ కొంకణ్-గోవా తీరానికి సమీపంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ వెల్లడించింది.
గాలుల దిశ, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వంటి అనుకూల పరిస్థితుల నేపథ్యంలో ఇది మరింత బలపడే అవకాశముంది.
రాబోయే రోజుల్లో ఇది తుపానుగా మారే అవకాశం కూడా ఉన్నట్లు సూచించింది.
దీని ప్రభావంతో గుజరాత్, గోవాల్లో ఆదివారం వరకు, కర్ణాటకలో మే 27 వరకు, మహారాష్ట్రలో మే 25న, తమిళనాడులో మే 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Details
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాత పరిధిలో మే 27 నాటికి మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ పేర్కొంది. రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది.
బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30°-32°C మధ్య నమోదవుతుండటంతో, అమెరికా ఆధారిత నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రిడిక్షన్ (NCEP) మోడల్ ప్రకారం ఇది తుపానుగా బలపడవచ్చని సూచన.
దీని ప్రభావంతో మే 27న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సముద్రం కలకలంగా మారే సూచనల నేపథ్యంలో మే 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణశాఖ హెచ్చరించింది.
Details
ఏపీపై రుతుపవనాల ప్రభావం
జూన్ 5 వరకు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. శనివారం (మే 25)న వర్షాభావం ఉండే జిల్లాలు:
ఓ మోస్తరు వర్షాలు, పిడుగులు : అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు : అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉద్యాన పంటల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
శుక్రవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.