Page Loader
Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు..ఒక్క రోజే 32 విమానాలకు
ఆగని బాంబు బెదిరింపులు..ఒక్క రోజే 32 విమానాలకు

Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు..ఒక్క రోజే 32 విమానాలకు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. విమానయాన సంస్థలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఈ బెదిరింపులు ఆగడం లేదు. ఆదివారం రోజున 30కి పైగా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి ఇప్పటివరకు విస్తారా, ఆకాశ ఎయిర్‌తో పాటు అనేక సంస్థల విమానాలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి, దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఒక్క రోజే 32 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు అత్యవసర తనిఖీలు చేపట్టారు. దిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విస్తారా విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించారు.

వివరాలు 

బాంబు బెదిరింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు

అక్కడా తనిఖీలు నిర్వహించి, రెండు గంటల తర్వాత తిరిగి లండన్‌కు పంపించినట్లు ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత కూడా చాలా విమానాలకు బాంబు బెదిరింపులు అందుకున్నట్లు సమాచారం. ఎయిరిండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్‌, విస్తారా, స్పైస్‌జెట్‌, స్టార్‌ ఎయిర్‌, అలయన్స్‌ ఎయిర్‌లకు చెందిన కొన్ని విమానాలకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ వ్యవహారంపై 'బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ' (BCAS) ఇప్పటికే ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇలాంటి చర్యలు చేసే ఆకతాయిలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి పౌర విమానయాన శాఖ సిద్ధమవుతోంది. బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని నో-ఫ్లై లిస్ట్‌లో చేర్చాలని యోచిస్తోంది. అంతేకాకుండా, అలాంటి వారికి కఠిన శిక్షలు విధించే దిశగా చర్యలు చేపడుతుంది.