Indian Workers: విదేశాల్లో రోజుకు 20 మందికిపైగా భారతీయ కార్మికుల మృతి.. గల్ఫ్ దేశాల్లోనే అధికం: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
గత ఐదేళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజుకు సగటున 20 మందికిపైగా భారతీయ కార్మికులు విదేశీ నేలపై ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఈ మరణాల్లో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల్లోనే నమోదవుతున్నాయి. విదేశాల్లో భారతీయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు జనవరి 29న రాజ్యసభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 2021 నుంచి 2025 వరకు మొత్తం 37,740 మంది భారతీయ కార్మికులు విదేశాల్లో మరణించారు. అయితే ఈ మరణాలకు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
వివరాలు
2021లో అత్యధికంగా 8,234మంది కార్మికులు మృతి
సంవత్సరాల వారీగా చూస్తే 2021లో అత్యధికంగా 8,234మంది కార్మికులు మృతి చెందారు. 2022లో ఈ సంఖ్య 6,614కి తగ్గింది.తర్వాత 2023లో మళ్లీ కొంత పెరిగి 7,291కు చేరింది.2024లో 7,747 మంది, 2025లో 7,854 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మొత్తం మరణాల్లో 86 శాతం గల్ఫ్ దేశాల్లోనే నమోదయ్యాయి.దేశాల వారీగా చూస్తే ఐదేళ్లలో అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 12,380 మంది,సౌదీ అరేబియాలో 11,757 మంది కార్మికులు మరణించారు. కువైట్‌లో 3,890 మంది,ఒమన్‌లో 2,821 మంది,మలేషియాలో 1,915 మంది, ఖతార్‌లో 1,760 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే కాలంలో విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులపై వేధింపులు, దోపిడీ, పనిస్థల సమస్యలకు సంబంధించి భారత రాయబార కార్యాలయాలకు మొత్తం 80,985 ఫిర్యాదులు అందాయి.
వివరాలు
2012 నుంచి 2018 మధ్య గల్ఫ్ దేశాల్లో రోజుకు సగటున 10 మంది భారతీయ కార్మికులు మృతి
వీటిలో కూడా యూఏఈ 16,965 ఫిర్యాదులతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత కువైట్‌లో 15,234, ఒమన్‌లో 13,295, సౌదీ అరేబియాలో 12,988 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక పాత గణాంకాలతో పోలిస్తే పరిస్థితి మరింత తీవ్రమైందని తెలుస్తోంది. 2018లో వెలువడిన పీటీఐ నివేదిక ప్రకారం 2012 నుంచి 2018 మధ్య గల్ఫ్ దేశాల్లో రోజుకు సగటున 10 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఆరు సంవత్సరాల కాలంలో బహ్రెయిన్, ఒమన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో కనీసం 24,570 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ నివేదిక పేర్కొంది.
వివరాలు
గల్ఫ్ ప్రాంతంలోనే ఐదేళ్లలో సగటున దాదాపు 18 మంది కార్మికులు మృతి
తాజా గణాంకాలతో పోలిస్తే మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. బహ్రెయిన్ మినహా మిగిలిన గల్ఫ్ దేశాల్లో 2021 నుంచి 2025 మధ్య మొత్తం 32,608 మంది భారతీయ కార్మికులు మరణించారు. అంటే గత ఐదేళ్లలో గల్ఫ్ ప్రాంతంలోనే రోజుకు సగటున దాదాపు 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.