LOADING...
Air India Crash: విమాన ప్రమాదంలో కాలిపోయిన శిశువును తన చర్మంతో బతికించిన తల్లి!
విమాన ప్రమాదంలో కాలిపోయిన శిశువును తన చర్మంతో బతికించిన తల్లి!

Air India Crash: విమాన ప్రమాదంలో కాలిపోయిన శిశువును తన చర్మంతో బతికించిన తల్లి!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ 12న అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఏఐ-171 విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో అత్యద్భుతంగా ప్రాణాలతో బయటపడిన వారిలో 30 ఏళ్ల మనీషా, ఆమె ఎనిమిది నెలల శిశువు ధ్యాంష్ ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరి కథ దేశ ప్రజలందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రమాదంలో ధ్యాంష్ శరీరం 36 శాతానికి పైగా కాలిపోయింది. తల్లి మనీషాకు 25 శాతం గాయాలయ్యాయి. కానీ తల్లి మనసు ఆ గాయాల్ని లెక్కచేయకుండా..తన ప్రాణాలకు తెగించి అగ్నికీలల నుంచి బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంతో మంటల్లోంచి బయటకు పరుగులు తీసింది. ఆ నిస్వార్థ ప్రేమకు నిదర్శనంగా,ధ్యాంష్ రెండు సార్లు మృత్యువుని ఎదిరించి ప్రాణాలతో తల్లి ఒడిలో ఆడుకుంటున్నాడు.

వివరాలు 

విమానం కూలిన వెంటనే భారీ మంటలు

మనీషా కుటుంబం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ సమీపంలోని ఇంట్లో నివసిస్తోంది. ప్రమాదం జరిగిన సమయానికి ఆమె కుమారుడు ధ్యాంష్‌తో కలిసి ఇంట్లోనే ఉంది. విమానం కూలిన వెంటనే భారీ మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల ఇళ్లు పొగతో నిండిపోయాయి. అయినా మనీషా భయపడకుండా, తన శరీరం కాలిపోతున్నా కూడా,తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో వెతికింది. ఎట్టకేలకు అతడిని చూసి చేతుల్లోకి తీసుకుని మంటల్లోంచి బయటకు పరుగెత్తింది. అప్పటికే శిశువుకి తీవ్రమైన కాలిన గాయాలు అయ్యినప్పటికీ ఆమె ధైర్యం వెనకడుగేయలేదు. ఆ సమయంలో అక్కడి రెస్క్యూ సిబ్బంది స్పందించి, తల్లి-బిడ్డలను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

వివరాలు 

మనీషా శరీరం 25 శాతం.. ధ్యాంష్ శరీరం 36 శాతం.. కాలాయి 

వైద్యులు పరీక్షించాక మనీషా శరీరం 25 శాతం కాలిపోయినట్టు,ధ్యాంష్ శరీరం 36 శాతం కాలిపోయినట్టు తెలిపారు. వెంటనే ఇద్దరినీ వేర్వేరు ఐసీయూ వార్డుల్లో చేర్చి అత్యవసర చికిత్స ప్రారంభించారు. శిశువు చర్మం తీవ్రంగా కాలిపోవడంతో అతనికి చర్మ మార్పిడి అవసరం ఏర్పడింది. ఈ స్థితిలో చికిత్స అందించకపోతే ప్రాణాపాయం ఉందని వైద్యులు తేల్చారు. ఈ విషయం తెలియగానే తల్లి మనీషా ఏమాత్రం ఆలోచించకుండా, తన చర్మాన్నే బిడ్డకు ఇవ్వాలని ముందుకొచ్చింది. ఇక వైద్యులు ఆలస్యం చేయకుండా ఆమె చర్మాన్ని తీసి శిశువు శరీరానికి అంటించారు. ఈ విధంగా తల్లి చర్మంతో బిడ్డకు జీవితాన్నిచ్చారు.

వివరాలు 

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లీబిడ్డలు 

దాదాపు ఐదు వారాల పాటు చికిత్స తీసుకున్న తల్లీబిడ్డలు చివరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మనీషా మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడిని ఎలా రక్షించిందో, ఆ భయానక ఘటనలో ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నదో వివరించింది. ఆమె చేసిన త్యాగం గురించి దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక యోధురాలిలా ప్రాణాలను తృణప్రాయంగా భావించి తన బిడ్డను రక్షించిన మనీషాకు ప్ర‌తి ఒక్కరూ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నారు. ఆమె ధైర్యాన్ని కొనియాడుతూ సోషల్ మీడియా అంతా ప్రశంసలతో నిండిపోయింది.