Andhra Pradesh: గ్రేటర్‌గా మారనున్న విజయవాడ, తిరుపతి.. 202 పంచాయతీల విలీనంపై ప్రభుత్వం దృష్టి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్‌గా మార్చే ప్రక్రియ మళ్లీ వేగం అందుకుంది. ఈ రెండు నగరాల పరిధిని పెంచేందుకు మొత్తం పది మండలాల్లోని 138 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థల్లో విలీనం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో మహా విశాఖపట్టణం నగరపాలక సంస్థ పరిధిలోకి మరో 64 గ్రామ పంచాయతీలను తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. జనగణన పూర్తికాకముందే ఈ మూడు నగరాలకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం పురపాలక శాఖ అధికారులకు సూచించినట్లు సమాచారం. జనగణన కారణంగా కొంతకాలంగా ఈ అంశం నిలిచిపోయినా ఇప్పుడు మళ్లీ కదలిక కనిపిస్తోంది.
వివరాలు
గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై ప్రభుత్వం మళ్లీ దృష్టి
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిని విస్తరించేందుకు చుట్టుపక్కల ఉన్న ఆరు మండలాల్లోని 75 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలన్న ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి నగరపాలక సంస్థ పాలకవర్గం ఇందుకు అనుకూలంగా తీర్మానం చేసింది. తర్వాతి ప్రభుత్వ కాలంలో ఈ అంశం ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించింది. గ్రేటర్‌గా మారితే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నగరాభివృద్ధికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
గ్రేటర్ దిశగా తిరుపతి
జక్కంపూడి, గొల్లపూడి, కానూరు, పోరంకి, తాడిగడప, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి వంటి ప్రాంతాలు ఇప్పటికే విజయవాడ నగరంలో భాగమైనట్టే ఉన్నప్పటికీ ఇప్పటికీ గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలుగానే కొనసాగుతున్నాయి. దీంతో అవసరమైన అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. తిరుపతి నగరాన్ని కూడా గ్రేటర్‌గా అభివృద్ధి చేయాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తిరుపతి గ్రామీణం, రేణిగుంట, చంద్రగిరి మండలాల్లోని 63 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి నగరపాలక సంస్థ పాలకవర్గం ఇప్పటికే తీర్మానం చేసింది. మంగళం, అవిలాల వంటి ప్రాంతాలు నగరంతో కలిసిపోయినా ఇప్పటికీ గ్రామ పంచాయతీలుగానే కొనసాగుతున్నాయి.
వివరాలు
64 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదన
సరిపడ నిధులు లేక అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నగర విస్తరణకు అనుగుణంగా ఈ ప్రాంతాలను కలుపుకొని గ్రేటర్ తిరుపతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కొనసాగుతోంది. మహా విశాఖపట్టణం నగరపాలక సంస్థ పరిధిని మరింత విస్తరించేందుకు ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లోని 64 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. వీటిలో చాలా ప్రాంతాలు ఇప్పటికే నగర జీవనశైలిలో భాగమైపోయాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ ప్రాంతాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలను నగరపాలక సంస్థలో చేర్చడం అవసరం
విశాఖ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలను నగరపాలక సంస్థలో చేర్చడం అవసరమని స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనకాపల్లి, భీమునిపట్నం, గాజువాక ప్రాంతాలు కూడా ఇదే విధంగా మహా విశాఖలో విలీనం కావడంతో అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేస్తున్నారు.