Chandrababu: ఎన్టీఆర్ సిద్ధాంతాలతో ముందుకు.. టీడీపీ లక్ష్యం అదే : చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు 'ఎక్స్' వేదికగా సందేశాలు పోస్టు చేశారు. యుగపురుషుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని చంద్రబాబు పేర్కొన్నారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్న ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని ఎప్పటికీ పాటిస్తూనే ఉన్నామని చెప్పారు. టీడీపీ అనేది కార్యకర్తల పార్టీ అని, ఆవిర్భావ దినోత్సవం అంటే ప్రతి ఒక్క కార్యకర్తకు ఇంటి పండుగలాంటిదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
వివరాలు
పేద ప్రజలకు అండగా టీడీపీ
ఇక నారా లోకేశ్ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం టీడీపీ ఆవిర్భవించిందని చెప్పారు. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతంతో పేద ప్రజలకు అండగా నిలిచిందని తెలిపారు. టీడీపీ ఏర్పడిన తర్వాతే అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. అలాగే, దేశానికి సంక్షేమ విధానాలను పరిచయం చేసిన పార్టీగా టీడీపీని అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.