Loading...
Patanjali Foods: పతంజలి ఆవు నెయ్యి బ్యాచ్ రీకాల్‌కు ఎఫ్‌డీఏ ఆదేశం
పతంజలి ఆవు నెయ్యి బ్యాచ్ రీకాల్‌కు ఎఫ్‌డీఏ ఆదేశం

Patanjali Foods: పతంజలి ఆవు నెయ్యి బ్యాచ్ రీకాల్‌కు ఎఫ్‌డీఏ ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ పతంజలి ఫుడ్స్‌కు మధ్యప్రదేశ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ విక్రయిస్తున్న ఆవు నెయ్యికి చెందిన ఒక బ్యాచ్‌ను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి తీసుకోవాలని (రీకాల్ చేయాలని) రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆదేశించింది. ఈ బ్యాచ్‌కు సంబంధించిన నెయ్యి నమూనాలను పరీక్షించగా, అవి ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలినట్లు కంపెనీ శనివారం స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన ఫైలింగ్‌లో వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో సేకరించిన పతంజలి ఆవు నెయ్యి నమూనాను అధికారులు పరీక్షించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్-2011లో నిర్దేశించిన ప్రమాణాలను ఆ నమూనా అందుకోలేదని ఎఫ్‌డీఏ అధికారులు నిర్ధారించారు.

వివరాలు 

ఈ రీకాల్ వల్ల ఆర్థికంగా పెద్ద ప్రభావం ఉండదని తెలిపిన సంస్థ

దీంతో సంబంధిత బ్యాచ్‌కు చెందిన నెయ్యి ఉత్పత్తులను తక్షణమే మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే, మధ్యప్రదేశ్ ఎఫ్‌డీఏ అధికారి ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్ చేయనున్నట్లు పతంజలి ఫుడ్స్ ప్రకటించింది.

ఈ పరిణామం వల్ల తమ కంపెనీ ఆర్థిక పరిస్థితిపై లేదా రోజువారీ కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం ఉండదని పతంజలి ఫుడ్స్ స్పష్టం చేసింది.

రీకాల్ కారణంగా ఏర్పడే నష్టం కూడా ప్రభావితమైన నెయ్యి బ్యాచ్ విలువకే పరిమితమవుతుందని తెలిపింది.

మరోవైపు, శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ఒక శాతం నష్టపోయి రూ.351 వద్ద ముగిసింది. గత ఏడాది కాలంలో పతంజలి ఫుడ్స్ షేరు ధర దాదాపు 41 శాతం పడిపోవడం గమనార్హం.

వివరాలు 

గతంలో కేరళలో జొన్న పిండి విషయంలోనూ పతంజలిపై ఇలాంటి ఆరోపణలే

పతంజలి ఉత్పత్తుల నాణ్యతపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు.

ఈ ఏడాది జూన్‌లో కేరళలోనూ ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది.

పతంజలి విక్రయిస్తున్న జొన్న పిండిలో పురుగుమందుల అవశేషాలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు కన్నూర్ జిల్లా ఆహార భద్రత అధికారులు గుర్తించారు.

దీంతో సంబంధిత బ్యాచ్ అమ్మకాలపై నిషేధం విధించారు. ఆ సమయంలోనూ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి.

కేరళలో చోటుచేసుకున్న వివాదం తర్వాత తాజాగా మధ్యప్రదేశ్‌లో ఆవు నెయ్యి నాణ్యతపై అభ్యంతరాలు వ్యక్తం కావడం పతంజలి ఫుడ్స్ ఉత్పత్తులపై వినియోగదారుల విశ్వాసం, సంస్థ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశముంది.

ADVERTISEMENT