
'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై కేశినేని నాని ధ్వజం
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తుంది.
టీడీపీ నాయకత్వంపై గురువారం ఎంపీ కేశినేని నాని మరోసారి విరుచుకుపడ్డారు.
తనను మహానాడుకు పిలవలేదని, విజయవాడ టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం లేదని పేర్కొన్నారు.
దేవినేని ఉమ, బోండా ఉమ, సౌమ్య తదితర టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు 'గొట్టంగాళ్లు' అంటూ పరుష పదజాలంతో ధ్వజమెత్తారు.
గత ఏడాదిన్నరగా టీడీపీలో ఆయన సోదరుడు కేశినేని చిన్ని ప్రాధాన్యత పెరుగుతుండటంతో నానికి అది నచ్చడం లేదు.
దీంతో నానికి తన లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సరైన గుర్తింపు లభించడం లేదు.
టీడీపీ
అవసరం అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: నాని
తనకు తెలియకుండానే టీడీపీ అధిష్టానం తన లోక్‌సభ పరిధిలోని ఆయా నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిందని, వారంతా ప్రొటోకాల్‌ను పాటించడం లేదని కేశినేని నానికి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ మారడంపై కేశినేని నాని స్పందిస్తూ.. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, విసుగు చెందినప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలిశారనే విషయం తనకు తెలియదన్నారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడి పిలుపు మేరకే తాను అక్కడికి వెళ్లానని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో తనకు చంద్రబాబు బీ -ఫారం ఇవ్వకున్నా ఇబ్బంది లేదన్నారు. తాను పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు.
ఈ ఎపిసోడ్ ప్రభావం విజయవాడ రాజకీయాలపై కచ్చితంగా పడుతుంది.