Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్'
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరుగుతున్న తవ్వకాల్లో ఈ రోజు (గురువారం) మరో అద్భుతం వెలుగుచూసింది. జామా మసీదు నుండి 100 మీటర్ల దూరంలో ఒక పురాతన బావి కనుగొనబడింది. ఈ బావి హిందువులు అధికంగా నివసించే ప్రాంతంలో ఉంది. దీనిని స్థానికులు "మృత్యు బావి"గా పిలుస్తున్నారు. ఈ బావి సమీపంలోనే ఒక ఆలయం ఉందని, అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయం అని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ ఆలయం ప్రస్తుతం పూర్తిగా మట్టిలో కూరుకుపోయి ఉంది. తవ్వకాలు జరిపితే ఈ ఆలయం బయటపడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.
సంభాల్‌ను మతపరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
సంభాల్ ఒకప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. పురాణ కథనాల ప్రకారం, సంభాల్‌లో 84 ప్రదక్షిణ మార్గాలు ఉండేవి, వీటిలో 68 పుణ్యక్షేత్రాలు, 19 ప్రత్యేక బావులు ఉన్నాయని చెబుతారు. ప్రతి బావికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం స్థానికులు తవ్వకాల్లో పాల్గొంటూ చారిత్రక ఆధారాలు సేకరిస్తున్నారు. సంభాల్‌ను మతపరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల సంభాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల కారణంగా ఈ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో స్థానిక పరిపాలన అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. ఆ తవ్వకాల్లో పలు చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద వెలుగుచూస్తున్నాయి.
సమీపంలోనే యమదగ్ని కుండ్
ప్రస్తుతం చందౌసిలో కనుగొనబడిన పురాతన మెట్ల బావిని శుభ్రం చేస్తున్నారు. తాజా తవ్వకాలలో మృత్యు బావి వెలుగుచూసింది. ఈ బావిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఇక్కడి సమీపంలోనే యమదగ్ని కుండ్ ఉందని కూడా చెబుతున్నారు, దీని కోసం అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. మృత్యుంజయ దేవాలయం గురించి స్థానికులు ఆసక్తికరమైన సమాచారం చెబుతున్నారు. వారి మాటల ప్రకారం,ఈ ఆలయం ఒకప్పుడు చురుకుగా ఉండేదని,ఇప్పుడు దాని కొంత భాగం గోడలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ ఆధారాలపై జిల్లా యంత్రాంగం పరిశోధనలను ముందుకు తీసుకువెళుతోంది. ప్రస్తుతం మృత్యు బావి తవ్వకాలు కొనసాగుతున్నాయి.అలాగే చందౌసిలో పరిశుభ్రత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల ద్వారా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అనేక వివరాలు వెలుగుచూడనున్నాయని ప్రజలు ఆశిస్తున్నారు.