Mukesh Ambani: ముకేష్ అంబానీకి మరో బెదిరింపు.. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మెయిల్
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. గత రెండు రోజుల్లో ఇది రెండో బెదిరింపు కావడం గమనార్హం.
తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని లేకుంటే, చంపేస్తామని, తమ వద్ద అత్యుత్తమ షూటర్లు ఉన్నారని శుక్రవారం ఓ మెయిల్ వచ్చింది.
అయితే అదే ఈ మెయిల్ ఖాతా నుంచి శనివారం మరో మెయిల్ వచ్చింది. దుండగులు రూ.200కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మొదటి మెయిల్‌కు స్పందించకపోవడంతో రెండోసారి మొత్తాన్ని దుండగులు పెంచారు.
దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. మెయిల్ పంపిన ఐపీ అడ్రస్‌ను పరిశీలించగా.. అది బెల్జియంలోని ఒక ప్రైవేట్ సర్వర్‌కు చెందినదిగా గుర్తించారు. ముంబై సైబర్ క్రైమ్ విభాగం దీనిపై విచారణ జరుపుతోంది.
ముంబై
టెర్రర్ కోణాన్ని తోసిపుచ్చలేం: ముంబై పోలీసులు
అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ దేవేంద్ర మున్సీరామ్ ఫిర్యాదు ఆధారంగా.. బెదిరింపు మెయిల్ అడ్రస్ shadabkhan@mailfence.com యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే కేవలం బెదిరించడం కోసమే దుండగులు ఈమెయిల్ అడ్రస్‌ను రూపొందించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
అంతేకాకుండా దుండగులు తప్పుదారి పట్టించేందుకు బెల్జియం వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ బెదిరింపు మెయిల్‌లు ఫేక్ అని అనుమానిస్తున్నప్పటికీ, టెర్రర్ కోణంతో సహా ఇతర అవకాశాలను తాము తోసిపుచ్చలేదని పోలీసులు తెలిపారు.
అంబానీ, అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడిన బీహార్‌కు చెందిన వ్యక్తిని గతేడాది ముంబై పోలీసులు అరెస్టు చేశారు.