GRAP-4: ముంబైలో పెరిగిన కాలుష్యం.. GRAP-4తో కఠిన ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గాలి కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో, అధికారులు అత్యంత కఠినమైన GRAP-4 నియంత్రణలు అమల్లోకి తీసుకొచ్చారు. ఢిల్లీ తర్వాత విష గాలితో బాధపడుతున్న నగరాల జాబితాలో ముంబై చేరింది. మజ్‌గావ్, డీయోనార్, మలాద్, బోరివలి ఈస్ట్, చకలా-అంధేరి ఈస్ట్, నేవీ నగర్, పౌవై, ములుండ్ ప్రాంతాల్లో గాలి నాణ్యత 'వెరీ పూర్', 'సివియర్' స్థాయికి చేరడంతో అక్కడ నిర్మాణ పనులు, దుమ్ము ఎక్కువగా వచ్చే కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. బీఎంసీ ఇప్పటివరకు 50కి పైగా కన్‌స్ట్రక్షన్ సైట్‌లకు పనులు ఆపాలని నోటీసులు జారీ చేసింది. బేకరీలు, మార్బుల్ కట్టింగ్ యూనిట్ల వంటి చిన్న పరిశ్రమలు శుద్ధమైన విధానాలకు మారాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వివరాలు
ముంబై క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ విడుదల
ప్రతి వార్డులో ఇంజనీర్లు,పోలీసులు, GPS వాహనాలతో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి కాలుష్యం చేస్తున్న కార్యకలాపాలపై నిఘా పెట్టారు. గత కొన్ని రోజులుగా గాలి దెబ్బతో కళ్ల మంటలు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు,ఇది ఢిల్లీ పరిస్థితిని తలపిస్తోంది. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ముంబై కాంగ్రెస్ 'ముంబై క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్' విడుదల చేసి, స్వచ్ఛ గాలిని మౌలిక హక్కుగా గుర్తించాలి, 24 గంటల పర్యవేక్షణ పెంచాలి, 10 లక్షల చెట్లు నాటాలి, వాహనాలు-నిర్మాణం-పరిశ్రమలపై కఠిన నియమాలు అమలు చేయాలని సూచించింది.
వివరాలు
AQI 200 మించితే వెంటనే GRAP-4 అమల్లోకి..
గత వారం AQI పెరుగుదలపై జరిగిన సమీక్ష సమావేశంలో, మూడు రోజుల పాటు AQI 200 మించితే వెంటనే GRAP-4 అమల్లోకి వస్తుందన్నట్లు మునిసిపల్ కమిషనర్ డాక్టర్ భూషణ్ గగరాణి తెలిపారు. ఢిల్లీ తరహాలో ఇప్పుడు ముంబైలోనూ కాలుష్య సమస్య తీవ్రతరమవడం దేశవ్యాప్తంగా అధికార యంత్రాంగానికి హెచ్చరికగా నిలుస్తోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.