LOADING...
Mumbai: హంగేరియన్ టెక్నాలజీతో దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్.. ఎక్కడంటే?
హంగేరియన్ టెక్నాలజీతో దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్.. ఎక్కడంటే?

Mumbai: హంగేరియన్ టెక్నాలజీతో దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్.. ఎక్కడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లోనే తొలి మ్యూజికల్ రోడ్డుగా ముంబై కోస్టల్ రోడ్ మరో అరుదైన గుర్తింపు సాధించింది. ముంబయి కోస్టల్ రోడ్ అధికారులు ఈ వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా ఆకర్షణగా నిలిచారు. హంగేరియన్ సాంకేతికత సహకారంతో కోస్టల్ రోడ్డులో నారిమన్ పాయింట్ నుంచి వర్లి దిశగా వెళ్లే క్యారేజ్‌వేపై ప్రత్యేక సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. ఈ స్ట్రిప్‌లపై వాహనాలు నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తే, సుమారు 700 మీటర్ల పొడవునా 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రంలోని ప్రసిద్ధ గీతం 'జయ హో' వినిపించేలా రోడ్డును డిజైన్ చేశారు. దేశానికి అంకితంగా ఈ పాటను ఎంపిక చేసినట్లు, ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత బలపరచాలనే ఉద్దేశంతోనే ఈ మ్యూజికల్ రోడ్‌ను రూపొందించినట్లు ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.

వివరాలు 

ప్రాజెక్టుకు రూ.6.21 కోట్ల వ్యయం

బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేసిన ఈ ప్రాజెక్టుకు రూ.6.21 కోట్ల వ్యయం అయ్యిందని అధికారులు తెలిపారు. ముంబయి కోస్టల్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులలో భాగంగా ఈ రహదారిని నిర్మించగా, ఇది దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్డుగా నిలిచిందని పేర్కొన్నారు. ఇలాంటి మ్యూజికల్ రహదారులు ఇప్పటివరకు హంగరీ, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ వినూత్న రహదారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈరోజు అధికారికంగా ప్రారంభించారు.

వివరాలు 

ఏమిటీ కోస్టల్‌ రోడ్డు ప్రాజెక్ట్‌..?

ముంబయిలోని వివిధ ప్రాంతాల మధ్య రవాణా సౌలభ్యాన్ని పెంచడం, ట్రాఫిక్ రద్దీ సమస్యను తగ్గించడం లక్ష్యంగా బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కోస్టల్ రోడ్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా దక్షిణ ముంబయిలోని మెరైన్ లైన్స్ నుంచి ఉత్తర శివారు ప్రాంతమైన దహిసర్ వరకు మొత్తం 29.2 కిలోమీటర్ల పొడవున రహదారిని నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు రూ.14,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోడ్డులోని కొంత భాగంలో మాత్రమే వాహనదారులకు 'జయ హో' పాట వినిపించేలా ప్రత్యేకంగా మ్యూజికల్ స్ట్రిప్‌లను అమర్చారు.

Advertisement