Telangana Municipal Elections: నేడే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని నేడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పరిపాలనా సన్నద్ధతపై చర్చ జరగనుంది. అదేవిధంగా మధ్యాహ్నం ముఖ్య కార్యదర్శి (సీఎస్), డీజీపీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఇదే క్రమంలో నేడే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది.
Details
అధికార యంత్రాంగం సన్నద్ధ
ఒకవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం వేగంగా సన్నద్ధమవుతుండగా, మరోవైపు రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూసే దిశగా పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. అయితే కొత్త-పాత వివాదాలను ఎలా సమన్వయం చేయాలన్నది కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా మారింది. కొత్త నాయకులకు ప్రాధాన్యత ఇస్తే పాత నేతలను ఎలా బుజ్జగించాలి?, టికెట్ల పంపిణీలో అంతా కొత్త నాయకుల వెంట వచ్చినవారికే అవకాశం ఇస్తే పాత నాయకుల భవితవ్యం ఏంటి? అన్న ప్రశ్నలు పార్టీ లోపలే ఉత్పన్నమవుతున్నాయి.
Details
రాజకీయ వ్యూహాలను రచిస్తున్న పార్టీలు
ఇదిలా ఉండగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా స్థానికంగా తమ పట్టు నిలుపుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.