నిండు వేసవిలో గేట్లు తెరుచుకున్న మూసీ.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి
సాగు తాగు నీటికి తెలంగాణకే మణిహారమైన నాగార్జున సాగర్ నల్గొండ జిల్లాలో ఉంది. అయితే ఈ ప్రాజెక్టు తర్వాత జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా మూసీ రిజర్వాయర్ క గుర్తింపు పొందింది. ప్రస్తుతం మూసీలో నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండటంతో సోమవారం అధికారులు డ్యామ్ మూడో నంబర్ క్రస్ట్ గేట్ ద్వారా నీటిని దిగువకు వదిలారు. నిండు వేసవిలోనూ మూసీ గరిష్ఠ స్థాయిలో నిండటం రెండున్నర దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మూసీలో సోమవారం 644.60 అడుగుల మేర నీటి నిల్వలుండగా, పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులుగా అధికారులు తెలిపారు.
రైతులు, మత్స్యకారులు, పశువుల కాపర్లకు అలెర్ట్ : ప్రాజెక్ట్ ఈఈ
ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువవడంతో ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్ మూడో నెంబర్ క్రస్ట్ గేట్‌ను అరడుగు మేర తెరిచారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలుగా ఉండగా, సోమవారం సాయంత్రానికల్లా 4.36 టీఎంసీల నీటి లభ్యత అందుబాటులో ఉండటం గమనార్హం. గంగపుత్రులకు అలెర్ట్ : ఓ వైపు ఎగువ నుంచి 300 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా, మరోవైపు అంతే మొత్తం నీటిని దిగువ మూసీలోకి రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు మూసీ పరివాహకంలో రైతులు, మత్స్యకారులు అలెర్ట్ గా ఉండాలని నీటిపారుదలశాఖ ఈఈ డి.భద్రు సూచించారు. సూర్యాపేట, పెన్‌పహాడ్, కేతేపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో రైతులు తమ పశువులను వదిలిపెట్టొద్దని, మూసీ వాగు వెంట మోటార్లను భద్రపరుచుకోవాలని కోరారు.