Page Loader
Revanth Reddy: మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు!
మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు!

Revanth Reddy: మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం మూసీ నదికి జీవం పోసే పనిలో వేగంగా అడుగులు వేస్తోంది. వ్యతిరేకతలు లేకుండా, సమర్థవంతంగా నదీ పునరుజ్జీవానికి బలమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, బాపూఘాట్ వద్ద ప్రతిపాదిత గాంధీ సరోవర్, అలాగే మీర్ ఆలం ట్యాంక్ పై నిర్మించనున్న ఆధునిక బ్రిడ్జికి సంబంధించిన నమూనాలను సమీక్షించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రస్టీజియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు ఆంక్షలు విధించింది. నదీ గర్భ శుద్ధికి తోడు, జనాభాకు ప్రాజెక్ట్ స్పష్టంగా కనిపించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తోంది.

Details

పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ఈ ప్రాజెక్టు కార్యాచరణ పథకాన్ని ఖరారు చేశారు. బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే సీఎం, మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించబోయే ఆధునిక బ్రిడ్జికి సంబంధించి జూన్‌లో టెండర్లు పిలవాలని ఆదేశించారు. పూర్తిస్థాయి డీపీఆర్‌ను అవసరమైన సర్వేలు, డిజైన్లతో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రెండున్నర కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జిని అద్భుతంగా డిజైన్ చేయాలని సూచించారు. మీర్ఆలం ట్యాంక్‌లోని మూడు ద్వీపాలను సింగపూర్ తరహా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బర్డ్స్ పారడైజ్, వాటర్‌ఫాల్స్, వెడ్డింగ్ డెస్టినేషన్స్, అడ్వెంచర్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్, బోటింగ్, రిసార్ట్‌లు, హోటల్స్‌ వంటి ఆకర్షణలతో పీపీపీ మోడల్‌లో నిర్మించనున్నారు.

Details

ప్రాజెక్టులో వెనక్కే తగ్గే ప్రసక్తే లేదు

నీటి ప్రవాహం, అందుబాటు దృష్టిలో ఉంచుకొని డిజైన్లు రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. హైడ్రాలజీ, పర్యావరణ నిపుణుల సూచనలతో సర్వేలు నిర్వహించి, అవసరమైన అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. మీర్ ఆలం పక్కనే ఉన్న జూ పార్క్‌ను అభివృద్ధి పనులకు అనుసంధానం చేసి, నిబంధనల మేరకు జూ అధికారులతో కలిసి అప్‌గ్రేడ్ చేయాలన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల దృష్టిలో అభివృద్ధి ఎలా ఉండబోతుందో కనిపించేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రజల మద్దతుతో ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.