LOADING...
Sitharaman: భారత్‌ వృద్ధిపై మస్క్‌ పోస్ట్‌.. రాహుల్‌ గాంధీపై విమర్శలు
భారత్‌ వృద్ధిపై మస్క్‌ పోస్ట్‌.. రాహుల్‌ గాంధీపై విమర్శలు

Sitharaman: భారత్‌ వృద్ధిపై మస్క్‌ పోస్ట్‌.. రాహుల్‌ గాంధీపై విమర్శలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వృద్ధికి భారత్‌ చోదకశక్తిగా మారుతోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేసిన సోషల్ మీడియా పోస్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ప్రపంచ జీడీపీ (GDP) వృద్ధి రేటులో భారత్‌.. అమెరికాను మించి ముందంజలో ఉందని మస్క్‌ షేర్‌ చేసిన గణాంకాలను ఆమె ఉదహరించారు. ప్రపంచ జీడీపీ వృద్ధిలో చైనా 26 శాతం వాటా, భారత్‌ 17 శాతం వాటా, అమెరికా 9.9 శాతం వాటా కలిగి ఉన్నాయని సీతారామన్‌ వెల్లడించారు. మొత్తం ప్రపంచ వృద్ధిలో 43 శాతం వృద్ధి రేటు చైనా, భారత్‌ ఆర్థిక వ్యవస్థల నుంచే వస్తోందని పేర్కొన్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందనడానికి ఇవి స్పష్టమైన నిదర్శనాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Details

ప్రతిపక్ష నేతలపై ఆగ్రహం

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు దేశం వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే, ప్రతిపక్ష నేతలు మాత్రం విదేశాల్లో దేశ ఆర్థిక పరిస్థితులపై తప్పుడు ప్రచారాలు, తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. త్వరలోనే చైనాను కూడా దాటి మరింత ముందుకు వెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆమె స్పష్టం చేశారు.

Details

భారత్‌ను తక్కువ చేసి మాట్లాడొద్దు: కిరణ్‌ రిజిజు

ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు కూడా రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు. విదేశీ పర్యటనల్లో రాహుల్‌ గాంధీ భారత్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో భారత్‌ను 'మృత ఆర్థిక వ్యవస్థ'గా రాహుల్‌ అభివర్ణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను సాధారణంగా విదేశీయులు చేసే సోషల్ మీడియా పోస్టులపై స్పందించనని, కానీ బాధ్యత గల పౌరుడిగా దేశాన్ని ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడకూడదని రాహుల్‌కు చెప్పేందుకే ఎలాన్‌ మస్క్‌ పోస్టును ప్రస్తావిస్తున్నట్లు కిరణ్‌ రిజిజు తెలిపారు.

Advertisement