Loading...
Chandrababu: 'నా దేశం.. నా బాధ్యత'.. ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు
'నా దేశం.. నా బాధ్యత'.. ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు

Chandrababu: 'నా దేశం.. నా బాధ్యత'.. ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతిలోని రాయపూడి పరేడ్‌ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మీదుగా వేడుకల వేదిక వద్దకు సీఎం కాన్వాయ్‌తో పాటు బుల్లెట్‌ ఎస్కార్టు చేరుకుంది. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా సహా ఇతర ఉన్నతాధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "మన చేతిలో జాతీయ జెండా ఉండాలి.. మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు నేల కూడా తనదైన ముద్ర వేసిందని గుర్తుచేశారు.

వివరాలు

మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి ఇదే

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని చంద్రబాబు అన్నారు.

వారి త్యాగాలకు నిజమైన నివాళి అర్పించాలంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దాలని సూచించారు. స్వాతంత్ర్యం దేశ ప్రజలకు హక్కులు, గుర్తింపు, గౌరవాన్ని అందించిందని పేర్కొన్నారు.

"నా దేశం.. నా బాధ్యత" అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

దేశం తనకు ఏం చేసిందని ఆలోచించడం కంటే.. దేశం కోసం తాను ఏం చేయగలననే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు.

వివరాలు

2047 నాటికి వికసిత్‌ భారత్‌.. స్వర్ణాంధ్ర

2047 నాటికి వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్రను సాకారం చేయాలనే ఉన్నత లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు.. వికాసం నుంచి వైభవం వైపు పయనించాలని ఆకాంక్షించారు.

ఈ మహత్తర సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు అందరూ ఐక్యంగా కలిసి ముందుకు అడుగులు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

ADVERTISEMENT