LOADING...
Madhya Pradesh: 'నా భర్తకు 40 ఏళ్లు,నాకు 19'.. 'నా ప్రియుడితో కలిసి బతుకుతా'..హైకోర్టు సంచలన తీర్పు..!
హైకోర్టు సంచలన తీర్పు..!

Madhya Pradesh: 'నా భర్తకు 40 ఏళ్లు,నాకు 19'.. 'నా ప్రియుడితో కలిసి బతుకుతా'..హైకోర్టు సంచలన తీర్పు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 06, 2026
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

''నా భర్తతో నేను కలిసి జీవించలేను.మా ఇద్దరి మధ్య వయసు తేడా నా వయసుకంటే ఎక్కువగా ఉంది. ఆయన నన్ను సరిగా చూసుకోవడం లేదు.తల్లిదండ్రుల దగ్గరికీ వెళ్లాలనుకోవడం లేదు. నాకు నచ్చిన వ్యక్తితోనే జీవిస్తాను'' అని స్పష్టంగా తెలిపిన 19ఏళ్ల వివాహితకు మధ్యప్రదేశ్ హైకోర్టు మద్దతుగా నిలిచింది. ఆమె స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చిన గ్వాలియర్ బెంచ్.. ఆమెకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవించేందుకు చట్టబద్ధ అనుమతి ఇచ్చింది. అయితే,భద్రత దృష్ట్యా ఆరు నెలలపాటు ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా,తన భార్యను ఓ యువకుడు బలవంతంగా నిర్బంధించి ఉంచాడని ఆరోపిస్తూ భర్త హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.

వివరాలు 

యువతి కీలక వ్యాఖ్యలు

ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన యువతి..తన భర్త, తల్లిదండ్రులు,ప్రస్తుతం తనతో ఉన్న యువకుడు సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాను కలిసి ఉన్న వ్యక్తి తనకు కావాల్సిన స్వేచ్ఛ ఇస్తున్నాడని తెలిపింది. తన భద్రత, భవిష్యత్తు దృష్ట్యా భర్త లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్లే ఉద్దేశం లేదని కోర్టుకు స్పష్టం చేసింది. ''మరి ఎక్కడ జీవించాలని అనుకుంటున్నావు?'' అని న్యాయమూర్తులు ప్రశ్నించగా.. తనను బంధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడితోనే ఉండాలని ఆమె సమాధానమిచ్చింది.

వివరాలు 

యువతికి  కౌన్సెలింగ్ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన కోర్టు 

ఈ నేపథ్యంలో యువతితో ప్రైవేట్‌గా మాట్లాడి కౌన్సెలింగ్ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అంజలి జ్ఞానానిని కోర్టు ఆదేశించింది. కౌన్సెలింగ్ అనంతరం అంజలి జ్ఞానాని న్యాయమూర్తులతో మాట్లాడుతూ.. ''ఆ యువతి తన నిర్ణయంపై దృఢంగా ఉంది. తనకంటే ఎంతో పెద్దవాడైన వ్యక్తితో వివాహ జీవితంలో ప్రశాంతత కంటే ఇబ్బందులే ఎక్కువగా ఎదురయ్యాయి. అందుకే ఆ బంధం నుంచి బయటపడాలని నిర్ణయించింది'' అని వివరించారు. దీనిపై కోర్టు.. ఆ యువతితో కలిసి ఉన్న యువకుణ్ని ప్రశ్నించగా, ''ఆమెను నేను ప్రేమిస్తున్నాను. ఆమెకు విడాకులు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఉంది. ఆమెను బాగా చూసుకుంటాను. ఎలాంటి వేధింపులు ఉండవు'' అంటూ హామీ పత్రం సమర్పించాడు.

Advertisement

వివరాలు 

ఆరు నెలలపాటు 'శౌర్య దీదీ' పర్యవేక్షణలో..

ఆమె మేజర్ కావడం, స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. భర్త దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ అవసరం లేదని పేర్కొంది. అయితే, వెంటనే కలిసి జీవించేందుకు అనుమతి ఇవ్వకుండా.. ముందుగా ఆరు నెలలపాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వ 'శౌర్య దీదీ' పర్యవేక్షణలో ఉండాలనిజస్టిస్ ఆనంద్ పాఠక్, జస్టిస్ పుష్పేంద్ర యాదవ్ల ధర్మాసనం ఆదేశించింది.

Advertisement

వివరాలు 

'శౌర్య దీదీ' వ్యవస్థ ఏమిటి?

ఈ కేసులో భాగంగా ప్రభుత్వ న్యాయవాది అంజలి జ్ఞానాని, అలాగే ఆ మహిళను కోర్టుకు తీసుకువచ్చిన కానిస్టేబుల్ భావనను 'శౌర్య దీదీ'లుగా నియమించారు. 2024లో జరిగిన 'హర్‌చంద్ గుర్జర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ' కేసులో గ్వాలియర్ బెంచ్ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం.. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు మార్గదర్శనం చేయడం, వారికి రక్షణ కల్పించడం లక్ష్యం. ఇందుకోసం పోలీసు అధికారిణి లేదా జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం అర్హత కలిగిన వ్యక్తిని 'శౌర్య దీదీ'గా నియమిస్తారు. ముఖ్యంగా లైంగిక దాడుల బాధితులు, సంరక్షణ అవసరమైన బాలికలు, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్లకు ఈ వ్యవస్థ తోడ్పడుతుంది.

Advertisement