
Fake News alert: యూరియా సరఫరా పేరుతో అపోహలు.. నకిలీ వార్తలను నమ్మొద్దని ఏపీ ఫ్యాక్ట్‌చెక్ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో యూరియా సరఫరా (Urea Supply) పై జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ 'ఫ్యాక్ట్‌చెక్ విభాగం' స్పష్టం చేసింది. కేంద్రం నుంచి అదనంగా యూరియా సరఫరా అవుతోందనే నిజాన్ని వక్రీకరించుతూ, యూరియాను జపాన్‌కు తరలిస్తున్నట్లు ఒక నకిలీ వార్త కొందరు కావాలని వ్యాప్తి చేస్తున్నారని తెలిపింది. ఓ అగ్ర నటుడి ఫోటోతో సృష్టించిన బోగస్ ఐడీ ద్వారా ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని గుర్తించింది. అయితే ఆ ఫోటో నిజానికి బ్రెజిల్‌కు చెందినదని తేల్చి చెప్పింది. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం చట్టపరమైన నేరం అని, అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. రైతులు ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
Details
సీఎం చంద్రబాబు ప్రసంగం వక్రీకరణ
ఇక మరోవైపు సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని కూడా కొందరు వ్యక్తులు తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసి, ఆయన రైతులకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫ్యాక్ట్‌చెక్ పేర్కొంది. వాస్తవానికి యూరియా విషయంలో నకిలీ ప్రచారాలతో రైతులను మభ్యపెడుతున్న కొందరి కుట్రల గురించి సీఎం మాట్లాడిన మాటలను వక్రీకరించి, వేరే అర్థం వచ్చేలా మార్చారని తెలిపింది. దీనిపై ఫ్యాక్ట్‌చెక్ విభాగం 'ఎక్స్'లో ప్రత్యేకంగా పోస్టు పెట్టి, రైతులు, ప్రజలు ఇలాంటి నకిలీ వీడియోలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే నకిలీ వీడియోలు రూపొందించి ఇతరులకు పంపిస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.