Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు.. దిగువ గ్రామాలకు అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద భారీగా వరద నీరు పోటెత్తుతోంది. మొంథా తుపాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై తీవ్రంగా పడింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. పైప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు, మూసీ నది ఉధృతి కలిసి సాగర్ జలాశయాన్ని నిండుకుండలా మార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ప్రాజెక్టు వద్ద 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వీటిలో 16 గేట్లు 10 అడుగుల ఎత్తులో, మిగతా 4 గేట్లు 5 అడుగుల ఎత్తులో తెరవడంతో 2,72,608 క్యూసెక్కుల నీరు కిందకు విడుదలవుతోంది.
వివరాలు
నీటి ప్రవాహం దగ్గర ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల సూచన
సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం కూడా 590 అడుగుల వద్దనే నమోదవడంతో, అదనపు నీటిని విడదీయడం తప్పనిసరి అయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా,ప్రస్తుత నిల్వ కూడా అంతే స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో,అవుట్‌ఫ్లో కలిపి 3,06,062 క్యూసెక్కులుగా నమోదైంది. ఇదే సమయంలో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కాలువల్లో భారీగా వరదనీరు ప్రవహిస్తున్నందున వాగుల్లో లేదా నీటి ప్రవాహం దగ్గర ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. పశువుల కాపరులు,జాలరులు తదితరులు కాలువల పరిసరాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.