Tirupati: తిరుపతికి ఆరు వరుసల రహదారి.. అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి
ఈ వార్తాకథనం ఏంటి
కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లే వారికి నాయుడుపేట-రేణిగుంట మధ్య ప్రయాణం ఇంతకాలం నరకంలా అనిపించేది.
ఈ రహదారి రెండు వరుసలతో మాత్రమే ఉండటం, అధ్వానంగా ఉండటం వల్ల వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా అధికంగా ఉండేది.
57 కి.మీ. దూరం ప్రయాణించడానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టేది.
ఇప్పుడు ఆ సమస్యలకు పరిష్కారంగా ఆరు వరుసల రహదారి అందుబాటులోకి వచ్చింది.
71వ జాతీయ రహదారి విస్తరణ దాదాపు పూర్తికావడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
దీని వల్ల ఇప్పుడు కేవలం ఒక గంటలోనే 57 కి.మీ. దూరం ప్రయాణించి తిరుపతికి చేరుకోవచ్చు.
వివరాలు
రేణిగుంట వద్ద రౌండ్ అబౌట్
కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో నాయుడుపేట వద్ద మొదలైన ఈ రహదారి, శ్రీకాళహస్తి, ఏర్పేడు మీదుగా కడప-రేణిగుంట-చెన్నై జాతీయ రహదారిలో రేణిగుంట వద్ద కలుస్తుంది.
రూ. 1,931 కోట్ల వ్యయంతో ఈ రహదారి నిర్మాణ పనులు 2020 డిసెంబరులో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు అప్పగించగా, భూసేకరణ పూర్తికాగానే 2022 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి.
నాయుడుపేట వద్ద ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్, రేణిగుంట వద్ద రౌండ్ అబౌట్ నిర్మించారు.
శ్రీకాళహస్తి, ఏర్పేడు వద్ద బైపాస్ రహదారులు నిర్మించి, స్థానిక వాహనాల కోసం హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు అందుబాటులోకి తెచ్చారు.
కార్లు గంటకు 100 కి.మీ. వేగంతో, లారీలు, బస్సులు 80 కి.మీ. వేగంతో ప్రయాణించగలిగేలా ఈ రహదారి డిజైన్ చేయబడింది.
వివరాలు
57 కి.మీ. పొడవునా మీడియన్‌లో మొక్కలు, గడ్డి పెంచడానికి డ్రిప్ సిస్టమ్
14.5 మీటర్ల విస్తీర్ణంలో మూడు వరుసల రహదారిని రెండు వైపులా కలిపి మొత్తం 29 మీటర్ల వెడల్పు, మధ్యలో 4 మీటర్ల మీడియన్‌తో కలిపి 33 మీటర్ల వెడల్పు ఉండేలా నిర్మించారు.
మొదటి లైన్ లైట్ మోటారు వాహనాల కోసం, రెండో లైన్ బస్సులు, లారీల కోసం, మూడో లైన్ భారీ వాహనాల కోసం కేటాయించారు.
57 కి.మీ. పొడవునా మీడియన్‌లో మొక్కలు, గడ్డి పెంచడానికి డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
వంతెనలు, అప్రోచ్‌లు, సర్వీస్ రోడ్లతో పాటు గ్రామాలు ఉన్న చోట 1,500 లైట్లు ఏర్పాటు చేసి రాత్రిపూట రహదారి ప్రకాశించేలా చేశారు.
వివరాలు
స్వర్ణముఖి నదిపై వంతెన, ఏడుకు పైగా ప్రధాన వంతెనలు
ఏర్పేడు వద్ద టోల్‌ప్లాజా నిర్మించారు. భారీ వర్షాలు వచ్చినప్పటికీ పనులను నిరవధికంగా కొనసాగించామని మేఘా ఇంజినీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కె. రాంబాబు తెలిపారు.
శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిపై వంతెన, ఏడుకు పైగా ప్రధాన వంతెనలు, 10 చిన్న వంతెనలు, మూడు ఆర్వోబీలు, ఆరు వెహికల్ అండర్‌పాస్‌లు నిర్మించారు.