ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఏరులై పారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన లోకేశ్ డ్రగ్స్‌ను అరికట్టాలని ఫిర్యాదు చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. గంజాయి సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఆర్ఐ నివేదికను గవర్నర్‌కు లోకేశ్ అందజేశారు. డగ్స్ అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గంజాయి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే: లోకేశ్
దేశంలో గంజాయి ఏ మూలన దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌తో ముడిపడి ఉంటున్నాయని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయంతోనే ఏపీ మాదకద్రవ్యాల కేంద్రంగా తయారవుతోందన్నారు. గతంలో గంజాయి స్మగ్లింగ్‌లో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలే అధికంగా ఉన్నారని లోకేశ్ పెర్కొన్నారు. గత 4ఏళ్లుగా యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఈ మేరకు వారిపై దుష్ఫ్రభావం చూపిస్తుందన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న లోకేశ్‌కు గంజాయిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని మహిళలు, యువత ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన లోకేశ్ గంజాయికి సంబంధించిన సమాచారాన్ని సీడీ, పెన్ డ్రైవ్ లో గవర్నర్‌కు అందజేశారు.