Foxconn: మాన్యుఫ్యాక్చరింగ్ సిటీ అభివృధికి ఫాక్స్‌కాన్ అంగీకారం.. ఫాక్స్‌కాన్ బృందంతో లోకేశ్ సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఫాక్స్‌కాన్ బృందంతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులనూ వేగంగా అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు
ఉండవల్లిలోని తన నివాసంలో ఫాక్స్ కాన్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి..మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్ కాన్'మాన్యుఫ్యాక్చరింగ్ సిటీ'గా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు.
''ఆంధ్రప్రదేశ్'లో ఫాక్స్‌కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు ఆ సంస్థ సానుకూలత తెలిపింది.వారి బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుంది.రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం"అని లోకేశ్ తెలిపారు.
ఇందులో ఫాక్స్ కాన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వివరాలు
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు తీసుకున్న చర్యలను వివరించిన లోకేష్
ఈ సమావేశంలో తమ యూనిట్ల స్థాపనకు సంబంధించి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను, తమ టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు తీసుకున్న చర్యలను మంత్రి లోకేష్ వారికి వివరించారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చొరవను ఫాక్స్‌కాన్ భారత ప్రతినిధి విలీ కొనియాడారు.
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో కంపెనీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నందుకు విచారం వ్యక్తం చేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌తో తమ సంస్థకు చాలా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అన్నారు.
ఫాక్స్‌కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక యూనిట్లు ఉన్నాయని, దేశంలో తన కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
వివరాలు
20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీకి సహకరిస్తాం : విలీ
అధికారిక ప్రకటన ప్రకారం, ఫాక్స్‌కాన్ ఇండియన్ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సెమీకండక్టర్స్, డిజిటల్ హెల్త్, మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చేందుకు తప్పకుండా సహకరిస్తామని లోకేశ్‌కు తెలిపారు.
రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ఫాక్స్ కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించారు.
వీలైనంత త్వరగా కసరత్తు ప్రారంభించాలని లోకేష్ కోరారు. విలీతో పాటు ఫాక్స్‌కాన్ చైర్మన్ కార్యాలయం డైరెక్టర్ సెంథిల్ కుమార్, భారత్ దండి డిప్యూటీ డైరెక్టర్, మేనేజర్ వెక్టర్ చెన్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు.