
Nara Lokesh: రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రి జైశంకర్‌తో నారా లోకేశ్ భేటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ యువతను గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణా సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. ఈ సందర్భంగా లోకేశ్ విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటు ప్రాజెక్టులపై వివరాలు తెలియజేశారు. వీటిద్వారా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ విస్తరించి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్‌గా ఎదగగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం కూడా ప్రత్యేక చర్యలు అవసరమని లోకేశ్ సూచించారు. విదేశాలకు వెళ్తున్న కార్మికుల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం 'ప్రవాస భారతీయ బీమా యోజన'ను విస్తరించాలని కోరారు.
Details
ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు
ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్రంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, నిధుల మంజూరు అవసరమని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి 'స్కిల్ కాన్క్లేవ్'ల్లో కేంద్రం భాగస్వామ్యంపై కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్, ఇలాంటి కార్యక్రమాలకు నిరంతర సహకారం అందించాలని కోరారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సింగపూర్ పర్యటన వివరాలను జైశంకర్‌కు వివరిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు అవసరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది ప్రవాసాంధ్రులున్నారని లోకేశ్ పేర్కొన్నారు.
Details
ఏపీ తరుఫున పూర్తి మద్దతు
వీరిలో అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు, ఐరోపాలో 4 లక్షల మంది నివసిస్తున్నారని వివరించారు. అక్కడి ప్రజల సగటు తలసరి ఆదాయం $70,000 కాగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం $1,26,000 అని చెప్పారు. యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ దేశాలతో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్‌మెంట్స్ (MMPA) ఏర్పాటు చేయడంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు.
Details
డాటా షేరింగ్ సహకారం అత్యవసరం
రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో స్కిల్ డెవలప్‌మెంట్, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, జాయింట్ ట్రైనింగ్ & అసెస్‌మెంట్, ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ కార్యక్రమాల్లో రాష్ట్రం చురుకుగా పనిచేస్తోందని తెలిపారు. త్వరలో ప్రత్యేక 'నైపుణ్య పోర్టల్' ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులు, పారిశ్రామిక సంస్థల మధ్య వేదికగా పనిచేస్తుందని వివరించారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు పెరగడానికి, పెట్టుబడులు రప్పించడానికి, సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి భవిష్యత్‌లో కేంద్రం నుండి డాటా షేరింగ్ సహకారం అత్యవసరమని నారా లోకేశ్ జైశంకర్‌ను అభ్యర్థించారు.