
Nara Lokesh : ఏపీ అభివృద్ధికి మూడు కీలక అంశాలను వెల్లడించిన నారా లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణ వేగం (Speed of Doing Business) మాటల్లోనే కాకుండా, చేతల్లోనూ నిరూపితమైందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గడిచిన 15 నెలల్లోనే ఏపీకి 10 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు రాబట్టగలిగామని ఆయన తెలిపారు. ఈ విజయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, దార్శనిక నాయకత్వం ఫలితమని పేర్కొన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక 'భాగస్వామ్య సదస్సు - 2025'కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్‌లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్ - యూకే బిజినెస్ ఫోరం' రోడ్‌షోలో లోకేశ్ పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి మూడు కీలక అంశాలు
Details
రాష్ట్ర వేగవంతమైన అభివృద్ధికి మూడు ప్రధాన కారణాలు
1. సుస్థిర నాయకత్వం - ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. 2. బిజినెస్ స్పీడ్ - ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉదాహరణగా తీసుకుంటూ, ఎదురైన సమస్యలను కేవలం 12 గంటల్లో పరిష్కరించడంతో నిర్మాణం నవంబర్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు. 3. యువ నాయకత్వం - మంత్రుల్లో 17 మంది కొత్తవారే కావడం, స్టార్టప్ ఆలోచనలతో ముందుకు సాగడం.
Details
20 లక్షల ఉద్యోగాలు, క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీ
రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతికి రాబోతోందని, క్వాంటమ్ వ్యాలీ (అమరావతి), డేటా సిటీ (విశాఖ) ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తాయని అన్నారు. ముంబై కంటే రెట్టింపు సామర్థ్యంతో 1.5 గిగావాట్ల డేటా సెంటర్లు విశాఖలో వస్తున్నాయని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ముందడుగు ఏఐ (AI) విప్లవాన్ని అందిపుచ్చుకోవడానికి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఏఐని పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నామని చెప్పారు. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాల అభివృద్ధికి అక్టోబర్‌లో 'నైపుణ్యం' పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
Details
నిబంధనల సరళీకరణ, స్పేస్ సిటీ ప్రణాళిక
పరిశ్రమల స్థాపనకు అడ్డంకిగా ఉన్న నిబంధనలను సులభతరం చేస్తున్నామని, కార్మిక సంస్కరణలు, ల్యాండ్ కన్వర్షన్, నాలా ట్యాక్స్ వంటి అంశాలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సూచనలను 45 రోజుల్లో అమలు చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 5,000 ఎకరాల్లో స్పేస్ సిటీ నిర్మించనున్నామని, 'స్కైరూట్' సంస్థకు వారం రోజుల్లోనే 300 ఎకరాలు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించగా, యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, ఐసీఐసీఐ బ్యాంక్ యూకే సీఈఓ రాఘవ్ సింఘాల్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ & ఎండీ అభిషిక్త్ కిశోర్ పాల్గొన్నారు. వివిధ అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.