PM Modi: నారీశక్తి ఎదుగుదల ఆపారు.. విపక్షాలపై మండిపడ్డ నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. భారత మహిళల కలలను ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందకపోవడం నేపథ్యంలో శనివారం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రయోజనమే తమకు అత్యంత ముఖ్యమని, కానీ కొందరికి మాత్రం దేశం కంటే రాజకీయాలే ముఖ్యమని మోదీ వ్యాఖ్యానించారు. దేశ హితం కోసం, నారీశక్తి హితం కోసం ఈ బిల్లును తీసుకువచ్చామని ఆయన చెప్పారు. మహిళా శక్తిని ఈ దేశం ఇంకా పూర్తిగా చూడాల్సి ఉందని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం నారీశక్తిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
వివరాలు
కుటుంబ పార్టీలు మహిళలను ఎదగనివ్వవు
"మహిళా బిల్లును కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ అడ్డుకున్నాయి. అలాంటి కుటుంబ పార్టీలు మహిళలను ఎదగనివ్వవు" అని అన్నారు. ఆ పార్టీలు బిల్లును మాత్రమే కాదు, మహిళా శక్తిని కూడా ఓడించాయని పేర్కొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మర్చిపోరని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని అన్నారు. మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలకు తప్పకుండా శిక్ష పడుతుందని, ఆ పాపం వదిలిపెట్టదని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పాపం వారిని వెంటాడుతుందని చెప్పారు. అన్ని అంశాలను మహిళలు గమనిస్తున్నారని, గత 40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని గుర్తుచేశారు. ఎంతో నిజాయతీతో తీసుకొచ్చిన బిల్లును విపక్ష నేతలు అడ్డుకున్నారని అన్నారు.
వివరాలు
అన్ని రాష్ట్రాలకు సమాన బలం దక్కేలా ఈ బిల్లును రూపొందించాం
మహిళా బిల్లుకు క్రెడిట్ తీసుకోవాలని విపక్షాలను తాము కోరినట్లు కూడా తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమాన బలం దక్కేలా ఈ బిల్లును రూపొందించామని చెప్పారు. బిల్లును అడ్డుకున్న విపక్షాలు మహిళా శక్తికి వ్యతిరేకంగా వ్యవహరించాయని ఆయన విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకోవడం "భ్రూణహత్యతో సమానం" అని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన బాధ్యత కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ పార్టీలదేనని ఆరోపించారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదని అన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పలుమార్లు అడ్డుకుందని చెప్పారు. బిల్లును అడ్డుకొని విపక్షాలు తమ అసలు స్వరూపాన్ని చూపించాయని అన్నారు.
వివరాలు
స్థానిక పార్టీలపై కాంగ్రెస్ ఆధారపడుతోంది
కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవిలా వ్యవహరిస్తోందని, స్థానిక పార్టీలపై ఆధారపడి జీవిస్తోందని మోదీ విమర్శించారు. మహిళా బిల్లుపై కుట్రలు, కుతంత్రాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, డీఎంకేలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. "నారీశక్తి వందన్ అధినియం" బిల్లును వ్యతిరేకించిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అసత్యాలు ప్రచారం చేశాయని ఆయన ఆరోపించారు. స్వార్థ రాజకీయాలతో రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, అన్ని రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందితే అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరిగేవని తెలిపారు.
వివరాలు
ప్రజలను తప్పుదోవ పట్టించారు
సమాజ్‌వాదీ పార్టీ లోహియా కలలను తుంగలో తొక్కిందని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. జన్‌ధన్, డిజిటల్ పేమెంట్స్, జీఎస్టీ, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి అంశాలను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఉగ్రవాదం, నక్సలిజం విషయంలో కూడా కాంగ్రెస్ వైఖరిని ప్రజలు మరచిపోలేరని అన్నారు. సంస్కరణల పేరే వినగానే కాంగ్రెస్ వ్యతిరేకంగా నిలుస్తుందని, అది వారి నెగటివ్ రాజకీయాల భాగమని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్‌కు అలవాటని చెప్పారు. దేశానికి మేలు చేసే ప్రతి నిర్ణయాన్ని అడ్డుకోవడమే కాంగ్రెస్ నైజమని అన్నారు. సైనికుల "వన్ ర్యాంక్ వన్ పెన్షన్"ను 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ అడ్డుకుందని గుర్తుచేశారు.