తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ.. ప్రధాని రాకతో బీజేపీ ఎన్నికల ప్రచారం షురూ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అక్టోబర్ 10వ తేదీలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో, పార్టీలన్నీ తమ ఎన్నికల ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బి.ఆర్.ఎస్ పార్టీ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. అదలా ఉంచితే, తాజా సమాచారం ప్రకారం తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు.
నిజామాబాద్, మహబూబ్ నగర్ లో మోదీ పర్యటన
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నరేంద్ర మోడీ పర్యటనతోనే మొదలుపెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీలోని ఐటిఐ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. మోదీ వస్తున్న ఈ సభకు లక్షా 50వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ పర్యటన తర్వాత అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్ లో నరేంద్ర మోదీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లో బహిరంగ సభ కాకుండా రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది.