National Voters Day: యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ
యువ ఓటర్లు భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్ అని, 2000 సంవత్సరం తర్వాత జన్మించిన వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మాధ్యమాల ద్వారా యువతను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. అలాగే ఓటింగ్ పట్ల ఆసక్తి కనబర్చని పట్టణ ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్‌లో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. పాఠశాలల్లో కల్పించే ఈ సౌకర్యాలు శాశ్వతంగా ఉండేలా ఎన్నికల సంఘం దృష్టి సారిస్తుందని వివరించారు.
400వ అసెంబ్లీ ఎన్నికల మైలురాయికి అడుగు దూరంలో ఎన్నికల సంఘం
జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో 2011నుంచి ఇదే రోజున ప్రతిఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈఏడాది ఎన్నికల సంఘం 13న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించిన థీమ్‌ను కూడా ప్రకటించింది. 'ఓటింగ్‌ను సులభతరం చేయడం, ఖచ్చితంగా ఓటు వేయడం' అనే ఇతివృత్తాన్ని 2023వ సంవత్సరానికి ఎంచుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఇప్పటివరకు 17లోక్‌సభ, 16రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. అలాగే అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు జరిగిన 399 శాసనసభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఈసీ, త్వరలో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో జరగనున్న ఎలక్షన్లతో 400వ అసెంబ్లీ ఎన్నికల మైలురాయికి చేరుకోబోతోంది.