Workers Strike: సమ్మెకు పిలుపునిచ్చిన 10 కార్మిక సంఘాలు.. 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొనే అవకాశం ఉందని, దేశమంతటా 600కు పైగా జిల్లాల్లో దీని ప్రభావం కనిపిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. కార్మికులు,రైతులకు నష్టం కలిగించే విధానాలు,కార్పొరేట్లకు మేలు చేసే నిర్ణయాలను నిరసిస్తూ ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు సంఘాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని,ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
వివరాలు
గతేడాది సమ్మెను మించి ఈసారి ప్రభావం ఉంటుందన్న సంఘాలు
ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించడంతో ఉద్యమానికి మరింత బలం చేకూరింది. గతేడాది జూలై 9న జరిగిన సమ్మెలో సుమారు 25కోట్ల మంది పాల్గొనగా,ఈసారి అంతకంటే ఎక్కువ మంది కార్మికులు రోడ్డెక్కే అవకాశం ఉందని సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో కనీసం 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే,రాబోయే రోజుల్లో మరింత కాలం పాటు కొనసాగే తీవ్ర ఆందోళనలు చేపడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ బంద్ కారణంగా ఒడిశా,అసోం వంటి రాష్ట్రాల్లో సాధారణ జీవనం పూర్తిగా స్తంభించే అవకాశముందని సంఘాల నేతలు పేర్కొన్నారు.