Telangana: తెలంగాణలో స్టీవియా సాగుకు మంచి అవకాశాలు.. రైతులకు అధిక ఆదాయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రైతులు సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా విభిన్న రకాల పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వరి, పత్తి వంటి సాధారణ పంటలకే పరిమితం కాకుండా పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్, జెరానియం వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో చక్కెరకు సహజ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే స్టీవియా సాగుకు కూడా రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని హార్టికల్చర్ కాలేజీలో పార్టిసిపేటరీ రూరల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్ సొసైటీ (PRTSIS), గ్లోబల్ స్టీవియా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో జాతీయ స్టీవియా సమ్మిట్-2026 నిర్వహించారు.
వివరాలు
రైతులు, వ్యాపారవేత్తలు, వినియోగదారుల్లో స్టీవియా పంటపై అవగాహన లేమి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వాతావరణ పరిస్థితులు స్టీవియా సాగుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
ఏడాదిలో నాలుగు విడతలుగా ఆకులను కోసుకునే అవకాశం ఉండటంతో పాటు, సరైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని వివరించారు.
స్టీవియా సాగు విధానాలు, పంట ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాలపై రైతులు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం రైతులు, వ్యాపారవేత్తలు, వినియోగదారుల్లో స్టీవియా పంటపై తగినంత అవగాహన లేదని పేర్కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ పంటలో ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రజలకు తెలియజేయవచ్చని అభిప్రాయపడ్డారు.
వివరాలు
స్టీవియా సాగుకు అనుకూలమైన వాతావరణం
తెలంగాణలో స్టీవియా పంట సాగుకు అవసరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా 15డిగ్రీల నుంచి 38డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఈ మొక్కలు బాగా పెరుగుతాయి.
రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు ఈ పంటకు అనుకూలంగా ఉండటంతో సాగు చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వివరిస్తున్నారు.
ముఖ్యంగా నీరునిల్వ ఉండని ఎర్ర నేలలు,ఇసుకతో కూడిన గరప నేలలు స్టీవియా సాగుకు అనువైనవి.
ఒకసారి మొక్కలు నాటితే సుమారు మూడు నుంచి ఐదేళ్ల వరకు నిరంతరంగా ఆకుల దిగుబడి పొందవచ్చు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆకులను కోసి విక్రయించుకునే అవకాశం ఉంటుంది.
అయితే పంట సాగు ప్రారంభించే ముందే కొనుగోలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
స్టీవియా ఆకుల నుంచి తీపి పదార్థాన్ని ఎలా తయారు చేస్తారు?
ముందస్తుగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పందాలు చేసుకుంటే మార్కెటింగ్ సమస్యలను కొంతవరకు అధిగమించవచ్చు.
స్టీవియా ఆకుల్లో స్టీవియోల్ గ్లైకోసైడ్స్ అనే సహజ తీపి పదార్థాలు ఉంటాయి.
ఇవి సాధారణ చక్కెరతో పోలిస్తే సుమారు 200 నుంచి 300 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి. అందుకే వీటిని చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.
మొక్కలకు పూత వచ్చేలోపే ఆకులను కోస్తారు. అనంతరం వాటిని నేరుగా ఎండలో కాకుండా నీడలో లేదా ప్రత్యేక డ్రయ్యర్లలో తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆరబెడతారు.
ఆకుల్లోని తేమ పూర్తిగా తొలగిపోయి, చేతితో నలిపితే పొడిగా మారేంత వరకు ఎండబెడతారు. ఇలా సిద్ధమైన ఆకులను మెత్తని పొడిగా తయారు చేస్తారు.
వివరాలు
స్టీవియా ఆకుల నుంచి తీపి పదార్థాన్ని ఎలా తయారు చేస్తారు?
ఈ పొడిని సుమారు 60 నుంచి 70డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిలో నానబెడతారు.
దీంతో ఆకుల్లోని సహజ తీపి పదార్థాలు నీటిలో కరిగిపోతాయి.అయితే ఈ ద్రావణంలో ఆకుపచ్చ రంగుతో పాటు ఇతర మలినాలు,కొంత చేదు గుణం కూడా ఉంటాయి.
వీటిని తొలగించేందుకు అల్ట్రా ఫిల్ట్రేషన్ పద్ధతులు,యాక్టివేటెడ్ కార్బన్ లేదా అయాన్ ఎక్స్ఛేంజ్ రెసిన్లను ఉపయోగించి శుద్ధి చేస్తారు.
శుద్ధి చేసిన ద్రావణాన్ని వేడి చేసి అందులోని నీటిని ఆవిరి చేయడం ద్వారా చిక్కటి ద్రవంగా మారుస్తారు.
ఆ తర్వాత స్ప్రే డ్రయ్యింగ్ లేదా క్రిస్టలైజేషన్ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి తెల్లనిస్ఫటికాలు లేదా మెత్తని పొడిగా తయారు చేస్తారు.
ఈవిధంగా లభించే స్టీవియా తీపి పదార్థాన్ని చక్కెరకు సహజ ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు.