Page Loader
NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్ 
పార్టీ గుర్తు ఎక్కడికీ పోదు, ప్రజలు, కార్యకర్తలు మాతోనే ఉన్నారు: శరద్ పవార్

NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్ 

వ్రాసిన వారు Stalin
Jul 05, 2023
08:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ గుర్తును కోసం శరద్ పవార్-అజిత్ పవార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజా పరిణామాలపై అధినేత శరద్ పవార్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వైబి చవాన్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్సీపీ గుర్తు ఎక్కడికి పోదని సీనియర్ పవార్ అన్నారు. తమకు అధికార కాంక్ష లేదని, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తమను గెలిపించిన ప్రజలు, కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని చెప్పారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే‌తో పాటు పార్టీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, బాలాసాహెబ్ పాటిల్, అశోక్ పవార్, జయంత్ పాటిల్, రోహిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్సీపీ

అప్పుడు అవినీతిపరులు అని, ఇప్పుడెందుకు పొత్తు పెట్టుకున్నారు: శరద్ పవార్

వైబి చవాన్‌ ఆడిటోరియంలో జరిగిన సమావేశాన్ని శరద్ పవార్ చారిత్రకమైనది అభివర్ణించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని బృందం ఎలాంటి విధానాలను అనుసరించలేదని అన్నారు. అజిత్ పవార్‌కు ఏమైనా సమస్యలుంటే తనతో మాట్లాడాల్సిందని శరద్ పవార్ అన్నారు. కానీ అవినీతిపరులు అని పిలిచే వారితో అజిత్ పవార్ చేతులు కలిపారంటూ బీజేపీని కూడా దుయ్య బట్టారు. ఎన్సీపీ నాయకులను అవినీతి‌పరులు అన్న బీజేపీ, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుందని శరద్ పవార్ ప్రశ్నించారు. ఉద్ధవ్ ఠాక్రేకు ఏమి జరిగిందో అదే పునరావృతమైందన్నారు. ఈ కష్ట సమయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగాలని శరద్ పవార్ తన మద్దతుదారులు, ఎన్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎన్సీపీ

పార్టీ సింబల్ కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్ వర్గం

అజిత్ పవార్ ఆదివారం ఏక్ నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరడం వల్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఏర్పడింది. పవార్‌తో పాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ పార్టీ గుర్తు కోసం అజిత్ పవార్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్ పవార్ వర్గం ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శరద్ పవార్ స్పీచ్