LOADING...
NCR Regional Plan 2041: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు కొత్త రూపు.. 4 నమో సిటీలు, 30 నిమిషాల ప్రయాణంతో మెగా ప్లాన్!
4 నమో సిటీలు, 30 నిమిషాల ప్రయాణంతో మెగా ప్లాన్!

NCR Regional Plan 2041: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు కొత్త రూపు.. 4 నమో సిటీలు, 30 నిమిషాల ప్రయాణంతో మెగా ప్లాన్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. 2041 నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్ జనాభా దాదాపు 11 కోట్లకు చేరుకునే అవకాశం ఉండటంతో, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 'ఎన్‌సీఆర్ రీజినల్ ప్లాన్-2041'కు రూపకల్పన చేశారు. కేవలం రోడ్లు, ఇళ్ల నిర్మాణమే కాకుండా ప్రజలు నివసించే విధానం, ఉద్యోగ అవకాశాలు, రవాణా వ్యవస్థలను పూర్తిగా మార్చేలా ఈ ప్రణాళిక రూపొందుతోంది. ఈ ప్లాన్‌లో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ 'నమో సిటీలు', కొత్త పట్టణాల అభివృద్ధికి రూ.5,000 కోట్ల నిధులు, అలాగే కేవలం 30 నిమిషాల్లో ఎన్‌సీఆర్‌లోని ప్రధాన ప్రాంతాలకు చేరుకునే రవాణా వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

వివరాలు 

ఎందుకు కొత్త అభివృద్ధి నమూనా అవసరం?

ప్రస్తుతం ఎన్‌సీఆర్ జనాభా వేగంగా పెరుగుతోంది. 2011లో 5.81 కోట్లుగా ఉన్న జనాభా 2041 నాటికి 11.3 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. ఉపాధి, మెరుగైన జీవన సౌకర్యాల కోసం నగరాలకు వలసలు పెరుగుతుండటంతో పట్టణీకరణ మరింత వేగవంతం కానుంది. ఇప్పటివరకు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాలే ఈ అభివృద్ధికి కేంద్రాలుగా నిలిచాయి. అయితే ఈ ప్రాంతాలపై ఒత్తిడి పెరుగుతుండటంతో కొత్త అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో ఉద్యోగాలు, నివాసాలు, పరిశ్రమలను ఒక్క ఢిల్లీ చుట్టూ కాకుండా పలు ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుంది.

వివరాలు 

రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం

ఎన్‌సీఆర్ రీజినల్ ప్లాన్-2041 అమలైతే గృహ నిర్మాణం, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని పరిశోధన సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత వృద్ధి కొనసాగితే 2030 నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ సముదాయంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

'30 నిమిషాల ఎన్‌సీఆర్' అంటే ఏమిటి?

ఈ ప్రణాళికలో అత్యంత కీలక అంశం '30 నిమిషాల ఎన్‌సీఆర్' కాన్సెప్ట్. ఎన్‌సీఆర్‌లోని ప్రధాన నివాస, వ్యాపార ప్రాంతాలను ఆర్‌ఆర్‌టీఎస్, మెట్రో కారిడార్లు, జాతీయ రహదారులు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేసి, ప్రజలు అరగంటలోపు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చేయడమే లక్ష్యం. ఇలా చేయడం వల్ల ఉద్యోగ ప్రాంతాలు, పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు ప్రజలకు మరింత చేరువవుతాయి. దీంతో ఒకే నగరంపై ఆధారపడకుండా కొత్త ప్రాంతాల్లోనూ అభివృద్ధి వేగం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

గురుగ్రామ్ గ్లోబల్ సిటీ ప్రాజెక్టు

గురుగ్రామ్‌లో 1,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న గ్లోబల్ సిటీ ప్రాజెక్టు కూడా ఎన్‌సీఆర్ అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఇది కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను ఆకర్షించే ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగం భావిస్తోంది.

వివరాలు 

నాలుగు నమో సిటీల ప్రత్యేకత ఇదే..

ఈ ప్రణాళికలో అత్యంత ఆసక్తికరమైన ప్రతిపాదన నాలుగు కొత్త 'నమో సిటీలు'. ఇవి కేవలం కొత్త టౌన్‌షిప్‌లు మాత్రమే కాదు. భవిష్యత్ జనాభా అవసరాలను తీర్చే స్వయం సమృద్ధి పట్టణాలుగా వీటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఉపాధి, పరిశ్రమలు, విద్య, వైద్యం, వాణిజ్య కార్యకలాపాలు, నివాసాలు అన్నీ ఒకే ప్రాంతంలో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ఉద్యోగాల కోసం ప్రజలు ఢిల్లీపై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. నోయిడా విమానాశ్రయం,ఎక్స్‌ప్రెస్‌వేలకు ప్రాధాన్యం నమో సిటీల అభివృద్ధికి తోడుగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, విస్తరిస్తున్న మెట్రో,ఆర్‌ఆర్‌టీఎస్ నెట్‌వర్క్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇవి కొత్త వ్యాపార, పారిశ్రామిక, నివాస ప్రాంతాల అభివృద్ధికి ఊతమిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

ఢిల్లీలో భూముల కొరత

కొత్త నగరాల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న నగరాల అభివృద్ధిపైనా ప్లాన్ దృష్టి పెట్టింది. ఢిల్లీలో విస్తరణకు భూములు తక్కువగా ఉండటంతో భవిష్యత్తులో ఎత్తైన భవనాల నిర్మాణం తప్పనిసరి కానుంది. 2011లో చదరపు కిలోమీటరుకు 11,320 మంది ఉన్న జనసాంద్రత 2041 నాటికి 20,770 మందికి చేరే అవకాశం ఉందని అంచనా. అందుకే మెట్రో, ఆర్‌ఆర్‌టీఎస్ మార్గాల వెంట అధిక అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, నివాస సముదాయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

వివరాలు 

నివాసాలు, ఉద్యోగాలు ఒకేచోట..

ట్రాన్సిట్ ఆధారిత అభివృద్ధిలో భాగంగా నివాసాలు, కార్యాలయాలు, షాపింగ్ కేంద్రాలు, విద్య, వైద్య సదుపాయాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసే మిశ్రమ అభివృద్ధి విధానాన్ని అమలు చేయాలని ప్రణాళికలో ప్రతిపాదించారు. దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. భారీ మౌలిక సదుపాయాలే విజయానికి కీలకం 55 వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఎన్‌సీఆర్ ప్రాంతంలో 2041 నాటికి 11 కోట్ల మందికి పైగా నివసించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా రహదారులు, మెట్రోలు, రైల్వేలు, లాజిస్టిక్స్ హబ్‌లు, పారిశ్రామిక కారిడార్లు, ఇతర పట్టణ మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

వివరాలు 

ఫరీదాబాద్, ద్వారకా, గ్రేటర్ నోయిడాకు కొత్త అవకాశాలు

గురుగ్రామ్, నోయిడాల్లో భూముల ధరలు పెరుగుతుండటంతో భవిష్యత్తులో ఫరీదాబాద్, ద్వారకా, గ్రేటర్ నోయిడా వంటి ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా ఎదిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగం అంచనా వేస్తోంది. కొత్త నగరాలు, విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, వేగవంతమైన రవాణా వ్యవస్థలు కలిసి ఎన్‌సీఆర్‌లో నివాస, వాణిజ్య రంగాలకు కొత్త అవకాశాలను తీసుకురానున్నాయి.

వివరాలు 

ఎన్‌సీఆర్ భవిష్యత్తు ఇదే!

ఢిల్లీపై ఉన్న భారం తగ్గించి, అభివృద్ధిని పలు ప్రాంతాలకు విస్తరించడం, రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, కొత్త ఆర్థిక కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్‌సీఆర్‌ను పరస్పరం అనుసంధానమైన ఆధునిక నగరాల సముదాయంగా మార్చడమే 2041 ప్రణాళిక ప్రధాన లక్ష్యం. ఈ ప్రణాళిక విజయవంతంగా అమలైతే, వేగంగా పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్యలు, గృహ కొరత, మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాంతీయ అభివృద్ధి నమూనాగా ఎన్‌సీఆర్ నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం స్పష్టంగా ఉంది.. 30 నిమిషాల ఎన్‌సీఆర్, నాలుగు నమో సిటీలు, సమతుల్య అభివృద్ధితో కొత్త ఢిల్లీ-ఎన్‌సీఆర్ నిర్మాణం.

Advertisement