AP Municipal Elections: ఏపీలో 87 చోట్ల వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికలు.. కూటమికి 84 పదవులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశలో ఎన్నికలు జరిగిన 100 పట్టణ స్థానిక సంస్థల్లో సోమవారం డిప్యూటీ మేయర్లు,మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 87 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తవగా, కూటమి అభ్యర్థులు 84 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇందులో తెదేపా 57, జనసేన 19, భాజపా 8 పదవులు దక్కించుకున్నాయి. వైకాపా రెండు చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలిచారు. మరో 13 పట్టణ స్థానిక సంస్థల్లో అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటికి మంగళవారం ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు విశాఖపట్నం మినహా మిగిలిన 12 నగరపాలక సంస్థల్లో కొత్తగా ఎన్నికైన మేయర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
వివరాలు
పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత
విశాఖ మేయర్ శ్రావణి తండ్రి మరణించడంతో ఆమె ప్రమాణం వాయిదా పడింది. 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోనూ కొత్త ఛైర్‌పర్సన్లు బాధ్యతలు స్వీకరించారు.
పిఠాపురంలో జనసేన ప్రకటించిన బొజ్జా వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని మెజార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు.
మరో అభ్యర్థి పేరును ప్రతిపాదించడంతో వివాదం తలెత్తింది.
ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జోక్యంతో చివరకు వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.
అనంతరం ఎంపీ వ్యక్తిగత సహాయకుడిపై జనసేన కార్యకర్తలు దాడికి దిగడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
పలాస-కాశీబుగ్గలో జనసేన నుంచి అభ్యర్థి ముందుకు రాకపోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.
రాజంపేటలో తెదేపా అభ్యర్థి షబీనా పదవి వద్దనడంతో మరో అభ్యర్థిని ఎన్నుకునే విషయంలో వివాదం ఏర్పడింది.
వివరాలు
నంద్యాలలో వైకాపా కౌన్సిలర్ గైర్హాజరు
నాయుడుపేటలో భాజపా అభ్యర్థి పోటీకి సిద్ధమవడాన్ని తెదేపా వ్యతిరేకించడంతో ఎన్నిక వాయిదా పడింది.
సాలూరులో జనసేన మద్దతు ఇవ్వకపోయినా తెదేపా అభ్యర్థి పప్పులమోహన్‌రావు వైస్ ఛైర్‌పర్సన్‌గా గెలిచారు.
మార్కాపురంలో అధిష్ఠానం ఎంపిక చేసిన నాగజ్యోతికి సొంతపార్టీకి చెందిన ఐదుగురు జనసేన కౌన్సిలర్లు మద్దతివ్వకుండా గైర్హాజరయ్యారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరులో తెదేపా,వైకాపా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వైకాపా అభ్యర్థికి పదవి దక్కాల్సి ఉండగా,ఆ పార్టీ సభ్యులు గైర్హాజరు కావడంతో తెదేపా అభ్యర్థి ఎన్నికయ్యారు.
నంద్యాలలోనూ వైకాపా కౌన్సిలర్ గైర్హాజరుతో వైస్ ఛైర్‌పర్సన్ పదవి తెదేపాకు దక్కింది.
నిడదవోలులో తెదేపా ప్రకటించిన అభ్యర్థికి బదులుగా జనసేనకు చెందిన తోపరాల కల్యాణ చక్రవర్తి గెలిచారు.
అయితే ఆయనకు పార్టీ బీఫారం లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించారు.
వివరాలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్నిక రద్దు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేనకు కేటాయించిన పదవికి కొలగాని శిరీషకు బదులుగా కత్తి పద్మజను ఎన్నుకోవడంతో వివాదం చెలరేగింది.
శిరీష వర్గం ఆందోళనకు దిగింది. ఎన్నిక నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ హిమాంశు శుక్లా ఎన్నికను రద్దు చేశారు.
మంగళవారం తిరిగి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.