Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం.. మహాకూటమికి బిగ్ షాక్
బిహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎన్డీఏ అభ్యర్థులు బెలగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీ నియోజకవర్గాల్లో విజయం సాధించి మహాకూటమి (ఇండియా కూటమి) ప్రభావాన్ని చూపలేకపోయింది. తరారీలో తొలిసారి బీజేపీ విజయాన్ని నమోదు చేసింది. సునీల్ పాండే తనయుడు విశాల్ ప్రశాంత్ బీజేపీ తరఫున పోటీచేసి సీపీఐ (మాలె) అభ్యర్థి రాజు యాదవ్‌పై 10,612 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కోడలు దీపా మాంఝీ, ఇమామ్‌గంజ్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి రోషన్ మాంఝీపై 5,945 ఓట్ల తేడాతో గెలుపొందింది. దీపా మాంఝీ, మాంఝీ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించారు.
విశ్వజీత్ సింగ్‌పై మనోరమా దేవి గెలుపు
బెలగంజ్‌లో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్జేడీ కోటను జేడీయూ అభ్యర్థి మనోరమా దేవి పడగొట్టారు. ఆమె ఆర్జేడీ నేత సురేంద్ర యాదవ్ కుమారుడు విశ్వజీత్ సింగ్‌పై విజయం సాధించింది. రామ్‌గఢ్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరులో బీఎస్పీ అభ్యర్థి సతీష్ అలియాస్ పింటూ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి అశోక్ సింగ్ విజయం సాధించారు. కాగా ఆర్జేడీ అభ్యర్థి అజిత్ సింగ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఫలితాల్లో మహాకూటమి ప్రభావం కనిపించకపోవడంతో ఆర్జేడీ, వామపక్ష పార్టీలు గట్టి ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాయి. ఉప ఎన్నికల్లో ఎన్డీఏ సత్తా చాటడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సందేశాన్ని పంపించింది.