LOADING...
NEET UG 2026 Cyber Fraud: నీట్‌ పోర్టల్‌లోకి చొరబడి.. రీఫండ్‌లు కాజేసిన  యువకుడు..  
నీట్‌ పోర్టల్‌లోకి చొరబడి.. రీఫండ్‌లు కాజేసిన యువకుడు..

NEET UG 2026 Cyber Fraud: నీట్‌ పోర్టల్‌లోకి చొరబడి.. రీఫండ్‌లు కాజేసిన  యువకుడు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
07:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా, తాజాగా నీట్‌ పోర్టల్‌లో మరో భద్రతా లోపం బయటపడింది. రీ-ఎగ్జామ్‌ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలో నీట్‌ అభ్యర్థుల ఖాతాల్లోకి అక్రమంగా చొరబడి వారికి రావాల్సిన రీఫండ్‌ సొమ్మును కాజేసిన సైబర్‌ నేరగాడిని అహ్మదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన 19 ఏళ్ల నవీన్‌ యాదవ్‌ ఈ మోసానికి పాల్పడ్డాడు. బిహార్‌లోని గయా ప్రాంతానికి చెందిన అతడు నీట్‌ పోర్టల్‌లో ఉన్న భద్రతా లోపాలు, విద్యార్థులు ఉపయోగించిన బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఆసరాగా చేసుకొని అభ్యర్థుల ఖాతాల్లోకి అనధికారికంగా ప్రవేశించాడు.

వివరాలు 

. 150 మంది విద్యార్థుల ఖాతాల యాక్సెస్

సుమారు 350 మందికి పైగా నీట్‌ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు,అందులో దాదాపు 150 ఖాతాలను విజయవంతంగా యాక్సెస్‌ చేశాడు. ఇందుకోసం ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో పాస్‌వర్డ్‌లు, పిన్‌లు, ఎన్‌క్రిప్షన్‌ కీలను ఛేదించే బ్రూట్‌-ఫోర్స్‌ టెక్నిక్‌ను వినియోగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఖాతాల్లోకి ప్రవేశించిన తర్వాత విద్యార్థుల ప్రొఫైల్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా వివరాలను తొలగించి,తన ఖాతా వివరాలను నమోదు చేశాడు. దీంతో ఒక్కో విద్యార్థికి రావాల్సిన రూ.1,700 రీఫండ్‌ మొత్తం అతడి ఖాతాలోకి జమ అయ్యేలా చేశాడు. నీట్‌-యూజీ పోర్టల్‌లో అనుమానాస్పద రీఫండ్‌ లావాదేవీలు జరుగుతున్నట్లు అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కు ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాలు 

విద్యార్థులు తమ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు ఇతరులతో పంచుకోవదు  

బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని బిహార్‌లో అరెస్ట్‌ చేశారు. మొదట నిర్వహించిన నీట్‌-2026 పరీక్షను రద్దు చేయడంతో అభ్యర్థులకు పరీక్ష ఫీజును ఎన్‌టీఏ రీఫండ్‌ చేస్తోంది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని నవీన్‌ యాదవ్‌ ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నీట్‌ పోర్టల్‌లో భద్రతా వ్యవస్థలను ఎన్‌టీఏ మరింత బలోపేతం చేసింది. విద్యార్థులు తమ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని అధికారులు హెచ్చరించారు. పేర్లు, పుట్టిన తేదీలు లేదా సులభంగా ఊహించగలిగే సంఖ్యలను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగించకుండా, అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక గుర్తులతో కూడిన బలమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోవాలని సూచించారు.

Advertisement