LOADING...
NEET-UG 2026: నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌! రాజస్థాన్‌ ఎస్‌ఓజీ దర్యాప్తు
నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌! రాజస్థాన్‌ ఎస్‌ఓజీ దర్యాప్తు

NEET-UG 2026: నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌! రాజస్థాన్‌ ఎస్‌ఓజీ దర్యాప్తు

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ యూజీ-2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందన్న వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పరీక్షకు ముందు రాజస్థాన్‌లోని కొన్ని కోచింగ్‌ సంస్థలు పంపిణీ చేసిన అధ్యయన పత్రాల్లో ఉన్న ప్రశ్నలు, అసలు పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో భారీగా సరిపోవడం అధికారులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా దాదాపు 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఒకే విధంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాలకు చెందిన నెట్‌వర్క్‌ల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో రాజస్థాన్‌ ప్రత్యేక దర్యాప్తు విభాగం విచారణ ప్రారంభించింది. పరీక్ష నిర్వహించిన జాతీయ పరీక్షా సంస్థ కూడా లీకేజీ ఆరోపణలను పూర్తిగా ఖండించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

వివరాలు 

రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు విక్రయం 

ఈ నెల 3న నిర్వహించిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగానికి చెందిన 120కి పైగా ప్రశ్నలతో కూడిన ఒక ప్రాక్టీసు పత్రాన్ని గుర్తించినట్లు రాజస్థాన్‌ అదనపు డీజీపీ విశాల్‌ బన్సాల్‌, ప్రత్యేక దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆ పత్రం పరీక్షకు దాదాపు 42గంటల ముందే రాజస్థాన్‌లోని సికార్‌ ప్రాంతంలో వాట్సాప్‌ ద్వారా వ్యాప్తి చెందినట్లు నిర్ధారించారు. ఈఅధ్యయన పత్రాలను విద్యార్థులకు రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది అభ్యర్థుల నుంచి ముందుగానే రూ.30వేలకుపైగా వసూలు చేసినట్లు తెలిపారు. అసలు ప్రశ్నలు యాదృచ్ఛికంగా సరిపోయాయా? లేక ప్రశ్నాపత్రం ముందుగానే బయటకు వెళ్లిందా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. కొన్ని ప్రశ్నల్లో జవాబుల వరుస కూడా ఒకేలా ఉండటం అనుమానాలను మరింత పెంచుతోంది.

వివరాలు 

300కు పైగా చేతిరాత ప్రశ్నలు

దర్యాప్తులో భాగంగా ఆ ప్రాక్టీసు పత్రం కేరళలోని ఒక వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్‌ విద్యార్థికి చెందినదిగా అధికారులు గుర్తించారు. అతడు ఈ నెల 1న సికార్‌లో ఉన్న తన స్నేహితుడికి ఆ పత్రాన్ని అందజేశాడని, అనంతరం అది పీజీ వసతిగృహాలు, కోచింగ్‌ వర్గాలు, కెరీర్‌ సలహాదారులు, పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల వరకు చేరిందని వెల్లడించారు. ఆ మెటీరియల్‌లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రానికి సంబంధించిన 300కుపైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నట్లు తెలిపారు.

Advertisement

వివరాలు 

నీట్‌ ఇక పరీక్ష కాదు.. వేలం: రాహుల్

నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. నీట్‌ ఇప్పుడు పరీక్ష కాదని, అది బహిరంగ వేలంలా మారిపోయిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 23 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో 89ప్రశ్నాపత్ర లీక్‌లు, 48పునఃపరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు. దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు.

Advertisement

వివరాలు 

దర్యాప్తునకు సహకరిస్తాం

కేంద్ర ప్రభుత్వ హయాంలో పరీక్షల వ్యవస్థపై విశ్వాసం దెబ్బతిందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ వివాదంపై జాతీయ పరీక్షా సంస్థ స్పందించింది. నీట్‌ యూజీ-2026కు సంబంధించిన అవకతవకల ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించింది. పరీక్షను కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య నిర్వహించామని తెలిపింది. ప్రశ్నాపత్రాలను ప్రత్యేక జీపీఎస్‌ పర్యవేక్షణ వాహనాల ద్వారా తరలించినట్లు పేర్కొంది. అన్ని పరీక్షా కేంద్రాలను కేంద్ర నియంత్రణ గది నుంచి కృత్రిమ మేధ సహకారంతో పనిచేసే సీసీటీవీ వ్యవస్థల ద్వారా పర్యవేక్షించినట్లు వెల్లడించింది. అన్ని కేంద్రాల్లో పరీక్షా ప్రక్రియ ముందుగా రూపొందించిన విధానాల ప్రకారమే జరిగిందని స్పష్టం చేసింది.

వివరాలు 

దర్యాప్తునకు సహకరిస్తాం

పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని తెలిపిన సంస్థ, దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారం ఇప్పటికే అందించినట్లు వెల్లడించింది. మొత్తం వ్యవహారాన్ని పారదర్శకంగా పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. విచారణ పూర్తయ్యాక కేంద్ర విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని జాతీయ పరీక్షా సంస్థ స్పష్టం చేసింది.

Advertisement