విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాస్పత్రుల దయనీయ స్థితికి అద్దం పట్టే సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వైద్యలు, సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించారు తల్లిదండ్రులు.
కుమడలో గ్రామానికి చెందిన దంపతులు తమ చంటిబిడ్డ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది.
ఈ క్రమంలో చిన్నారి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అంబులెన్స్ కోసం ఏంతో ప్రాధేయపడ్డారు. అయితే ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు.
ఆంధ్రప్రదేశ్
మానవతా దృక్పథంతో స్పందించిన పాడేరు సిబ్బంది
బిడ్డను కోల్పోయిన దుఃఖంలో ఆ తల్లిదండ్రులు చేసేదేమీ లేక, చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు వరకు స్కూటీపై వెళ్లారు.
విషయం తెలుసుకున్న పాడేరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మానవతా దృక్పథంతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో చిన్నారి మృతదేహాన్ని ఆ తల్లిదండ్రులు పాడేరు నుంచి ముంచింగిపుట్టు మండలం కుమడకు అంబులెన్స్‌లో వెళ్లారు.
కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించిన విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆస్పుత్రుల్లో వైద్యం ఎలాగూ అందదు, చనిపోయిన వారిపట్ల కనీసం గౌరవం లేకపోవడంపై మండిపతున్నారు.