రూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు, సినీ వినీలాకాశంలో నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు శత జయంతి సంబంర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన బొమ్మతో రూ.100 నాణేన్ని రూపొందించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఆయనకు అరుదైన గౌరవం దక్కినట్లైంది.
దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసిన మింట్ అధికారులు
రూ.100నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించే అంశంపై చర్చించేందుకు ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని మింట్ అధికారులు బుధవారం కలిశారు. పురంధేశ్వరికి నమూనా నాణెం అందించి సలహాలను కోరారు. వెండితో ఈ నాణెం తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బొమ్మతో కూడిన ఈ రూ.100 నాణెం త్వరలో విడుదల కానుంది. అయితే రూ.100 నాణేన్ని ముద్రించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఇప్పటికే పురంధేశ్వరి చెప్పారు. అయితే తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్‌కు కేంద్రం అరుదైన గుర్తింపునిచ్చిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.